![ENG vs IND ODI: రెండో వన్డేలో టాస్ ఓడిన భారత్.. జైశ్వాల్ ఔట్.. కోహ్లీ ఇన్](https://static.v6velugu.com/uploads/2025/02/england-india-2nd-odi-team-india-lost-the-toss_uipJT4x2bt.jpg)
ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య ఒడిషా కటక్‌లోని బారామతి స్టేడియం వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 9) రెండో వన్డే మరి కాసేపట్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెల్చింది. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో వన్డేకు భారత జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. తిరిగి రెండో వన్డేకు జట్టులోకి వచ్చాడు.
కోహ్లీ రావడంతో జట్టు కూర్పులో భాగంగా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌ను బెంచ్‌కు పరిమితం చేశారు. అలాగే.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను రెండో వన్డేకు జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో మిస్టీరియస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ప్లేయింగ్ లెవన్లోకి తీసుకున్నారు. టీ20 ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తోన్న వరుణ్ చక్రవర్తి.. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లోకి అరంగ్రేటం చేశాడు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వరుణ్ చక్రవర్తికి టీమిండియా క్యాప్ అందించి ఆహ్వానం పలికాడు.
ఇక, మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో వన్డేలో కూడా గెలుపొంది మరో మ్యాచు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా బరిలోకి దిగింది. తొలి వన్డేలో ఓటమి పాలైన ఇంగ్లాండ్.. రెండో మ్యాచులోనైనా విజయం సాధించి.. సిరీస్ రేసులో నిలవాలని భావిస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత జట్టు:
రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్ జట్టు:
ఫిలిప్ సాల్ట్ (WK), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (c), జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్