IND vs ENG: సమిష్టిగా రాణించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ టార్గెట్

IND vs ENG: సమిష్టిగా రాణించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ టార్గెట్

కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టును కట్టడి చేయలేక భారీ స్కోర్ సమర్పించారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ జో రూట్ 69 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో  జడేజా 3 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య,హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ తలో వికెట్ పడగొట్టారు. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. తొలి వన్డే మాదిరిగానే సాల్ట్(26), డకెట్(65) తొలి  వికెట్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 65 బంతుల్లోనే 81 పరుగులు జోడించి భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. ముఖ్యంగా పవర్ ప్లే లో డకెట్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ కు చేరినా.. జట్టును రూట్(69), బ్రూక్(31) జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు వీరిద్దరూ 66 పరుగులు జోడించి ఇంగ్లాండ్ ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. 

జడేజా పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ తో బ్రూక్ ఔటయ్యాడు. బట్లర్(34), రూట్ కాసేపు వికెట్ పడకుండా ఇన్నింగ్స్ ను ముందు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రూట్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెట్ అయ్యారన్న బ్యాటర్లు రూట్, బట్లర్ ఔటైనా చివర్లో లివింగ్ స్టోన్(41) మెరుపులు మెరిపించి ఇంగ్లాండ్ ను 300 పరుగుల మార్క్ ను దాటించాడు.