![Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. యథావిధిగా ఇంగ్లండ్ - ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్](https://static.v6velugu.com/uploads/2025/02/england-to-play-afghanistan-at-champions-trophy-says-ecb_cLgxfFetIE.jpg)
దాయాది దేశం ఏ ముహూర్తాన ఆతిథ్య హక్కులు దక్కించుకుందో కానీ, ఛాంపియన్స్ ట్రోఫీని వివాదాలు వీడటం లేదు. హైబ్రిడ్ మోడల్ విధానంతో భారత్, పాక్ క్రికెట్ బోర్డుల నడుమ నెలకొన్న సమస్య ఓ కొలిక్కి వచ్చిందనుకుంటే.. టోర్నీని కొత్త వివాధాలు చుట్టు ముడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌ను ఇంగ్లండ్ జట్టు బహిష్కరించాలని బ్రిటిష్ చట్టసభ సభ్యులు ఆ దేశ క్రికెట్ బోర్డు ఈసీబీ(ECB)ని కోరారు.
మహిళలపై ఆంక్షలు
మూడేళ్ల క్రితం అమెరికా దళాలు.. ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లిపోవడంతో అధికారం తాలిబన్లు చేతుల్లోకి వచ్చింది. ఆనాటి నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు స్వేచ్ఛ లేదు. అడ్డగోలుగా ఆంక్షలు విధిస్తున్నారు. స్కూల్లలో చదివే విద్యార్థినులు ఆరవ గ్రేడ్ మించి చదవకూడదట. అంతేకాదు, మహిళలు ఉద్యోగాలు చేయకుండా ఆంక్షలు, జిమ్‌లలో.. పబ్లిక్ పార్కుల్లో కనిపించకూడదన్న కఠిన నిభంధనలు, మగ తోడులేకుండా ప్రయాణం చేసేవారికి కొరడా దెబ్బలు.. వంటి క్రూరాతిక్రూరమైన నిర్ణయాలతో తాలిబన్లు మృగాల్లా వ్యవహరిస్తున్నారు.
ALSO READ | Zaheer Khan: పాకిస్థాన్‌కు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలిస్టులను చెప్పిన జహీర్ ఖాన్
తమ ఆదేశాలను ధిక్కరిస్తే.. ఇంటి పెద్దలను కఠినంగా శిక్షిస్తామని బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ రాక్షస పాలనను బ్రిటిష్ చట్టసభ సభ్యులు ఖండించారు. స్త్రీలకు విలువలేనటువంటి తాలిబన్ దేశానికి చెందిన ఒక జట్టు(ఆఫ్ఘనిస్తాన్)తో క్రికెట్ ఆడకూడదని గళమెత్తారు. ఏకంగా 160 మందికి పైగా రాజకీయ నేతలు సంతకం చేసిన లేఖను ఇంగ్లండ్ బోర్డు ఈసీబీ(ECB)కి అందజేశారు.
యథావిధిగా ఇంగ్లండ్ - ఆఫ్ఘన్ మ్యాచ్
ఆ లేఖపై ప్రభుత్వం, ఐసీసీ, ఆటగాళ్లతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. శుక్రవారం(ఫిబ్రవరి 07) కీలక ప్రకటన చేసింది. మ్యాచ్ బహిష్కరించబోమని, యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది. క్రికెట్ సమాజం మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ సమస్యలను పరిష్కరించలేమని ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ అన్నారు
"మ్యాచ్ బహిష్కరిస్తే.. అది ఈసీబీకి చెడ్డ పేరు. చివరి నిమిషంలో తప్పుకున్నారన్న అప్రతిష్ట వస్తుంది. అటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేం. అందునా, ఆఫ్ఘన్ పౌరులకు వారి జట్టు క్రికెట్ ఆడటం ఆనందాన్ని ఇస్తుందని మేం విన్నాం. అందువల్ల, మ్యాచ్ బహిష్కరించాలని అనుకోవడం లేదు. యథావిధిగా ఇంగ్లండ్ - ఆఫ్ఘన్ మ్యాచ్ జరుగుతుంది.." అని రిచర్డ్ థాంప్సన్ ఒక ప్రకటనలో తెలిపారు.