
- శుభారంభంపై ఇరు జట్ల గురి
- మ. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
లాహోర్: ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్, గాయాలతో డీలా పడ్డ ఆస్ట్రేలియా చాంపియన్స్ ట్రోఫీలో తొలి పోరుకు సిద్ధమయ్యాయి. గ్రూప్–బిలో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌లో తలపడనున్న ఇరు జట్లూ టోర్నీలో శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఆసీస్, ఇంగ్లండ్ ఇటీవల కాలంలో వన్డే ఫార్మాట్‌లో తడబడుతున్నాయి.
రెండుసార్లు చాంపియన్ కంగారూ టీమ్ గత రెండు సిరీస్‌ల్లో శ్రీలంక (0–2), పాకిస్తాన్ (1–2) చేతిలో ఓడింది. గాయాల కారణంగా కెప్టెన్ కమిన్స్,హేజిల్‌వుడ్, స్టార్క్, అనూహ్యంగా రిటైర్ అయిన స్టోయినిస్ లేకపోవడంతో బలహీనమైన ఆసీస్‌ను స్టీవ్ స్మిత్ నడిపించనున్నాడు. ఈ టోర్నీలో తొలిసారి ట్రోఫీ నెగ్గాలని ఆశిస్తున్న బట్లర్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్.. ఈ నెల ఇండియాతో వన్డే సిరీస్‌లో 0–3తో వైట్‌వాష్ అయింది. మొత్తంగా యాషెస్ సిరీస్ ప్రత్యర్థుల మధ్య పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.