T20 World Cup 2024: సెమీస్ బెర్త్ ఎవరిది..? ఇంగ్లాండ్‌తో సఫారీలు ఢీ

T20 World Cup 2024: సెమీస్ బెర్త్ ఎవరిది..? ఇంగ్లాండ్‌తో సఫారీలు ఢీ

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా శుక్రవారం (జూన్ 21) హై వోల్టేజ్ సమరం జరగనుంది. ఇంగ్లాండ్ తో సౌతాఫ్రికా సమరానికి సిద్ధమైంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరు జట్లు బలంగా ఉండడంతో ఈ పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇరు జట్లు సూపర్ 8 లో తొలి మ్యాచ్ లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి.

ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ కు చేరువవుతుంది. బలాబలాలను చూసుకుంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 25 టీ20 మ్యాచ్ లాడాయి. ఇంగ్లాండ్ 12 మ్యాచ్ ల్లో గెలిస్తే.. సౌతాఫ్రికా 12 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్ ఫలితం తేలలేదు. టీ20 వరల్డ్ కప్ లో 6 మ్యాచ్ లాడితే ఇంగ్లాండ్ 2.. సౌతాఫ్రికా నాలుగు మ్యాచ్ ల్లో గెలిచాయి.         

పటిష్టంగా ఇంగ్లాండ్:

టోర్నీలో సూపర్ 8 కు అర్హత సాధించాడానికి కష్టపడిన ఇంగ్లాండ్.. ఇప్పుడు టైటిల్ ఫేవరేట్ గా మారిపోయింది. సూపర్ 8 లో తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ ను చిత్తు చేయడంతో ఇప్పుడు అన్ని జట్లకన్నా ఇంగ్లాండ్ ప్రమాదకారిగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ లో ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ భీకర ఫామ్ లో ఉండడం ఇంగ్లాండ్ కు కొండంత బలం. బట్లర్, బెయిర్ స్టో ఫామ్ లోనే ఉన్నారు. వీరికి తోడు నిఖార్సైన ఆల్ రౌండర్లు మొయిన్ అలీ, సామ్ కరన్, లివింగ్ స్టోన్ ఉండనే ఉన్నారు. బౌలింగ్ లో ఆర్చర్ మునుపటి ఫామ్ అందుకొని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించాడు. రషీద్, మార్క్ వుడ్, టోప్లీ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. 

హేన్డ్రిక్స్, మార్కరం ఫామ్ అందుకుంటారా..?

సౌతాఫ్రికా జట్టు చూడడానికి స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్నా.. నిలకడగా ఆడలేకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. ఒక మ్యాచ్ లో ఆడిన ప్లేయర్లు మరో మ్యాచ్ లో విఫలమవుతారు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను నమ్మలేని పరిస్థితి. ఓపెనర్ హేన్డ్రిక్స్, కెప్టెన్ మార్కరం పరుగులు చేయడానికి తంటాలు పడుతున్నారు. కీలకమైన ఈ మ్యాచ్ లో వీరు ఫామ్ లోకి రావాలని జట్టు ఆశిస్తుంది. మిల్లర్, డికాక్, క్లాసన్ ఏ క్షణంలోనైనా మ్యాచ్ ను మలుపు తిప్పగలరు. బౌలింగ్ లో స్టార్ బౌలర్లు రబడా, నోకియా రాణించడం సౌతాఫ్రికాకు కలిస్ వచ్చే అంశం. మార్కో జాన్సన్ ఈ గాడిలో పడాల్సి ఉంది. స్పిన్నర్లు షంసి, మహరాజ్ రాణిస్తే సఫారీలకు తిరుగుండదు.