T20 World Cup 2024: 19 బంతుల్లోనే ఛేజింగ్.. పసికూనపై ఇంగ్లాండ్ విశ్వరూపం

T20 World Cup 2024: 19 బంతుల్లోనే ఛేజింగ్.. పసికూనపై ఇంగ్లాండ్ విశ్వరూపం

వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ గాడిలో పడింది. తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ పై వర్షం.. రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఓటమి ఇంగ్లాండ్ ను కంగారెత్తించాయి. సూపర్ 8 కు వెళ్లాలంటే ఒమన్ పై ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో జూలు విదిల్చింది. పసికూన ఒమన్ పై   దారుణంగా విరుచుకుపడి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. కేవలం 19 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేజ్ చేసి సూపర్ 8 ఆశలను సజీవంగా ఉంచుకుంది. 

గురువారం(జూన్ 13) అర్దరాత్రి ఆంటిగ్వా వేదికగా ఒమన్ పై జరిగిన మ్యాచ్ లో 8 వికెట్లతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఒమన్ విధించిన 48 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3.1 ఓవర్లలోనే ఛేజ్ చేసి భారీ గెలుపుతో నెట్ రన్ రేట్ ను మెరుగుపర్చుకున్నారు. బట్లర్ 8 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్ తో 24 పరుగులు చేసి మ్యాచ్ ను త్వరగా ముగించాడు.  ప్రస్తుతం, ఇంగ్లండ్ +3.081 రన్ రేట్‌ స్కాట్లాండ్ కంటే మెరుగ్గా ఉంది. చివరి మ్యాచ్ లో నమీబియాతో గెలిచి.. ఆస్ట్రేలియాతో స్కాట్లాండ్ ఓడిపోతే ఇంగ్లాండ్ సూపర్ 8 కు చేరుతుంది. 

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటిగ్ చేరిన ఒమన్ ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. రషీద్, మార్క్ వుడ్, జోఫ్రే ఆర్చర్ విజృంభించడంతో 13.2 ఓవర్లలో 47 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీయగా, మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. గ్రూప్ బి లో భాగంగా ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్ 8 కు చేరుకోగా.. నమీబియా, ఒమన్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మరో బెర్త్ కోసం ఇంగ్లాండ్, స్కాట్లాండ్ పోటీ పడుతున్నాయి.