మాకు విదేశీ కోచ్‌లు వద్దు.. ఇంగ్లీష్ రాక అల్లాడుతున్నాం: పాకిస్థాన్ బౌలర్

మాకు విదేశీ కోచ్‌లు వద్దు.. ఇంగ్లీష్ రాక అల్లాడుతున్నాం: పాకిస్థాన్ బౌలర్

పాకిస్థాన్ క్రికెటర్లకు ఇంగ్లీష్ భాషా సమస్య ఉందన్న విషయం అందరికీ విదితమే. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం వచ్చిరానీ ఇంగ్లీష్ మాట్లాడి నలుగురిలో ఎన్నోసార్లు నవ్వులు పాలయ్యాడు. అలా అని వారిని కించపరచడం మా ఉద్దేశ్యం కాదు. ఆంగ్ల భాష రాకపోవడం వల్ల వారు పడుతున్న బాధలేంటో ఆ జట్టు పేసర్ పూసగుచ్చినట్లు మీడియాకు వివరించాడు. విదేశీ కోచ్‌లతో పాటు అనువాదకులను నియమించాలని.. ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీకి మొరపెట్టుకున్నాడు.

విదేశీయులపైనే నమ్మకం

దేశ మాజీ క్రికెటర్లను నమ్మని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. విదేశీయులను కోచ్‌లుగా నియమిస్తోంది. ఈ మధ్యనే పాకిస్తాన్ జాతీయ జట్టుకు కొత్త కోచ్‌లుగా గ్యారీ కిర్‌స్టెన్ (వైట్-బాల్), జాసన్ గిల్లెస్పీ (టెస్ట్)లను నియమించింది. టీ20ప్రపంచకప్ 2024 సమయంలో కిర్‌స్టెన్ జట్టుతో ఉండగా, త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం గిలెస్పీ జట్టుతో కలవనున్నాడు. వీరి సేవలు బాగానే ఉంటాయి కానీ, మాట్లాడటానికి ఇంగ్లీష్ భాష సమస్యగా పరిణమిస్తోందని పాక్ పేసర్ నసీమ్ షా తెలిపాడు. 

తమకు వచ్చిన ఇంగ్లీష్.. వారికి అర్థమవుతుందో లేదో అన్న భయంతో అసలే సంభాషించలేకపోతున్నామని నసీమ్ షా వివరించాడు. అంతేకాదు, వారు మాట్లాడే వేగాన్ని అందుకోలేకపోతున్నామని మీడియా ముందు వాపోయాడు. కోచ్‌లుగా విదేశీయులనే నియమించాలనుకుంటే, ట్రాన్స్ లేటర్ (అనువాదకుడి)ని కూడా జాతీయ జట్టులోకి చేర్చుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును నసీమ్ షా కోరాడు.

"విదేశీ కోచ్‌లతో భాషా సమస్య ఉంది. వారి సూచనలను అనువదించడానికి మాకు ఎవరైనా కావాలి. స్వంత భాషలో కోచ్‌తో కమ్యూనికేట్ చేయడం సులభం..' అని షా విలేకరుల సమావేశంలో అన్నాడు. అతని వ్యాఖ్యలతో మీడియా మిత్రులు నవ్వుకున్నారు. ఇన్నాళ్లు ఈ సమస్య ఎందుకు బయట పెట్టలేదని వారు షాను ప్రశ్నించగా.. గతంలో కోచ్‌లు మాట్లాడిన ఇంగ్లీష్ తనకు అర్థమయ్యిందని తెలిపాడు.

పరువు తీశావ్.. 

నసీమ్ షా ఇంగ్లీష్ రాదని అంగీకరించడాన్ని పాక్ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశం పరువు తీశావ్.. అంటూ అతన్ని బండబూతులు తిడుతున్నారు. ఈ విషయంలో కొందరు భారత అభిమానులూ అతి చేస్తున్నారు. నసీమ్ షా మాటలను మీమ్స్ రూపంలో నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.