ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు, బహుళ జాతీయ కంపెనీలు దేశంలో తమ శాఖలను విస్తరిస్తున్న సమయంలో, ఉన్నత ఉద్యోగాలు పొందటానికి ఎదుర్కోవాల్సిన పోటీని తట్టుకోడానికి ఇంగ్లిషు భాషా పరిజ్ఞానం తప్పనిసరి. ఈ విషయంలో ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ప్రధానంగా, గ్రామాల్లో స్టూడెంట్స్ ఇంగ్లిష్ పై పట్టు లేక కార్పొరేట్ జాబ్స్‌కి దూరమవుతున్నారు. ఈ సమస్య తొలగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ బడుల్లో కూడా ఆంగ్ల భోదన విధానం అమలు చేయాలని తాజా కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. ఈ నిర్ణయం హర్షించదగ్గదే. అయినప్పటికీ కొత్త విధానం సత్ఫలితాలు ఇవ్వాలంటే కావాల్సిన మౌలిక సదుపాయాలుండాలి. ప్రధానంగా ఆంగ్ల మాధ్యమంలో అన్ని సబ్జెక్టులు బోధించడానికి భారీ సంఖ్యలో తగు అర్హతలున్న టీచర్లను నియమించాలి. ఎందుకంటే, ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న అత్యధిక టీచర్లు తెలుగు మీడియం చదివినవారు కావడమే కాక, బి ఎడ్ లో కూడా వారు ఎక్కువగా మెథడాలజీ ని కూడా తెలుగులోనే చదవడం వల్ల ఇంగ్లిష్‌లో వారు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఆంగ్ల భోదన చేపట్టడానికి భారీ ఉపాధ్యాయ నియామకాలు స్వల్పకాలంలో చేపట్టాలంటే ప్రభుత్వానికి కత్తిమీద సాము అనే చెప్పవచ్చు. నూతన విద్యా విధానం ( నెప్ 2020 )ను కూడా అమలు చేయాలంటే ప్రభుత్వ బడుల్లో ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో మౌలిక సదుపాయాలను విద్యార్ధి- ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం కల్పించాలంటే ఈ బడ్జెట్ లోనే భారీ నిధుల కేటాయింపు జరగాలి. ఇంకో వైపు కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా ఉపశమనం పొందనంత వరకు ఆంగ్ల భోదన కష్టమే. కరోనా కేసులు పెరిగిన ప్రతిసారి బలయ్యేది విద్యావ్యవస్థనే . లాక్ డౌన్‌లో ఆన్ లైన్‌లో బోధన చేపట్టిన ప్రతిసారి గ్రామీణ బడుల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆన్ లైన్‌లో ఇంగ్లిష్ లెస్సన్స్ వినాలంటే వారికి శక్తికి మించిన పనే అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికి పరిస్థితులు అనుకూలించి, ప్రణాళిక ప్రకారం, నిధుల కేటాయింపు, నియామకాల పూర్తి సకాలంలో జరిగితే తెలంగాణ విద్యావ్యవస్థలో నవశకానికి నాంది పడ్డట్టే అవుతుంది.
- డా.ఎం. డి. ఖ్వాజా మొయినొద్దీన్