Frank Duckworth: క్రికెట్‌లో విషాదం.. DLS పద్ధతి సృష్టికర్త కన్నుమూత

Frank Duckworth: క్రికెట్‌లో విషాదం.. DLS పద్ధతి సృష్టికర్త కన్నుమూత

మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన సంధర్భాల్లో ఫలితాలను నిర్ణయించడానికి డక్‌వర్త్-లూయిస్ పద్ధతి(DLS)ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ పద్ధతిని కనుగొన్న వారిలో ఒకరైన డీఎల్‌ఎస్ మెథడ్ సహ ఆవిష్కర్త ఫ్రాంక్ డక్‌వర్త్(84) కన్ను మూశారు. ఆయన మరణవార్తను ఐసీసీ ద్రువీకరించింది. ఫ్రాంక్ డక్‌వర్త్ మరణం పట్ల క్రికెటర్లు, నిపుణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వర్షం పడితే.. మ్యాచ్ రద్దే..!

డీఎల్‌ఎస్ పద్ధతి రాకమునుపు వర్షం అంతరాయం కలిగిస్తే మ్యాచ్‌ను రద్దు చేసేవారు. దీనికి పరిష్కారం కనుగొనాలని ఫ్రాంక్ డక్‌వర్త్ ఆలోచించారు. ఆ ఆలోచనా రూపమే.. DL మెథడ్. ఆయన టోనీ లూయిస్‌తో కలిసి డక్‌వర్త్-లూయిస్ పద్ధతిని రూపొందించారు. దాంతో, విజేతను నిర్ణయించడానికి అవకాశం లభించింది. దీనిని 1997లో  మొదటిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో ఉపయోగించారు. అయితే, ఐసీసీ 2001‌లో వర్షప్రభావిత మ్యాచ్‌ల్లో లక్ష్యాలను నిర్ణయించడానికి డీఎల్‌ఎస్ పద్ధతిని ప్రామాణికంగా తీసుకుంది. 

డీఎల్‌ఎస్ పద్ధతిలో మార్పులు.. 

ఫ్రాంక్ డక్‌వర్త్- టోనీలూయిస్ రూపొందించిన డీఎల్‌ఎస్ పద్ధతిలో ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్‌ స్టెర్న్ కొన్ని మార్పులు చేశారు. ఆ తర్వాత దీనికి 'డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్(DLS)'గా పేరు మార్చారు. ఈ సిస్టం కొన్ని జట్లకు వరంగా మారగా.. కొన్ని జట్లకు శాపంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగించలేని సందర్భాల్లో అప్పటివరకు విజయం దిశగా దూసుకెళ్తున్న జట్లు ఎన్నోసార్లు ఓటమిని చవిచూశాయి.