విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి, అంతరిక్ష గుట్టును విప్పడానికి, ప్రముఖుల జీవిత విశేషాలను అర్థం చేసుకోవడానికి, మనం చూడని ప్రదేశాలను అక్షరయాత్రలో వీక్షించడానికి, మానవ నాగరికత పరిణామాన్ని తెలుసుకోవడానికి, జీవన పోరాటంలో ఎదురు దెబ్బలను తట్టుకొని నడవడానికి పుస్తక పఠనం ఎంతో సహకరిస్తుంది. లక్ష్యాలను సునాయాసంగా ఛేదించడానికి, మానవ జీవితాల్లో సంక్లిష్టతలను జీర్ణించుకోవడానికి, జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి, వివేకం, విజ్ఞానం, ఆలోచనాశక్తిని విస్తృత పరుచుకోవడానికి అందుబాటులో ఉన్న ఏకైక ఉత్తమ సాధనం బుక్రీడింగ్. పుస్తక పఠన నైపుణ్యంతో విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, మానసిక వికాస దిశగా, విజ్ఞాన వెలుగుల దిశగా పయనించడమే పుస్తక పఠన కళ లేదా ఆర్ట్ ఆఫ్ రీడింగ్.
పుస్తక ప్రయోజనాలు కోకొల్లలు
పుస్తకం చదవడం శ్వాస తీసుకోవడం లాంటిది. పుస్తకం, కలం, బ్లాక్ బోర్డు అనేవి ప్రపంచాన్ని మార్చగలిగే మహత్తర శక్తిని కలిగి ఉంటాయి. ఈ శక్తికి గురువు తోడైతే లభించే శక్తి అపారం. మన సంపాదన కరిగిపోవచ్చు, భూములను కోల్పోవచ్చు, ధనం ఖర్చు కావొచ్చు. కానీ, పుస్తకం ద్వారా నేర్చుకున్న విజ్ఞానం తరిగిపోలేని శాశ్వత ఆస్తి అవుతుంది.
పుస్తక పఠనంతో విజ్ఞాన వికాసం, కెరీర్‌ను మెరుగుపరుచుకోవడం, ఉన్నత ఉద్యోగాన్ని పొందేలా ఉపకరించడం, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పెంచడంలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బహుముఖ వికాసానికి పుస్తక పఠనం దోహదపడుతుందనడంలో సందేహం లేదు. క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, జీవితాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడంలాంటి అనేక ప్రయోజనాలు పుస్తకాల వల్ల కలుగుతాయి. చిన్నతనం నుంచే పిల్లలకు పుస్తకాలు చదవడమనే అలవాటుచేస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారనడంలో సందేహం లేదు.
విద్యతోనే వికాసం
గొప్ప పుస్తకాల పఠనం మన జీవితాలను మలుపు తిప్పగలవు. కొన్ని పుస్తకాలను స్పృశించి వదిలేయడం, మరి కొన్నింటిని లోతుగా అర్థం చేసుకోవడం, కొన్నింటిని మననం చేసుకోవడం పాఠకుడికి తెలియాలి. చిరిగిన చొక్కానైనా తొడుక్కొని ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కోమని పెద్దలు చెప్పిన విషయాన్ని మనం సదా గుర్తించుకోవాలి. విద్యావంతమైన సమాజం ద్వారా రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వికాసం రాజ్యమేలుతుందని తెలుసుకోవాలి.
విద్యావంతులు అధికంగా ఉన్న దేశాలు అభివృద్ధిలో ముందుండడం, తలసరి ఆదాయాలు అధికంగా ఉండడం, జీవన ప్రమాణాలు మెరుగుపడడం, శాంతి నెలకొనడం, క్రమశిక్షణ కలిగిన సమాజ విలువలు నెలకొనడం తప్పనిసరిగా జరుగుతోంది. పుస్తక పఠనాన్ని నమ్ముకున్న సమాజంలో ఆలోచనాశక్తి పెరుగుతున్నది. నూతన ఆవిష్కరణలు బయటపడడం, విలక్షణ ఆలోచనలు పురుడు పోసుకోవడం అనాదిగా జరుగుతూనే ఉన్నది.
నేటి అంతర్జాల వలయంలో చిక్కిన యువత పుస్తక పఠనాన్ని ద్వితీయ ప్రాధాన్యంగా గుర్తిస్తున్నారు. ఇంటర్నెట్ ప్రభావంతో డిజిటల్వైపు మొగ్గు చూపడం.. రేపటితరానికి రాబోయే ప్రమాదానికి సంకేతం.
జాతీయ డిజిటల్ లైబ్రరీ స్థాపన
పుస్తక పఠన ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘జాతీయ డిజిటల్ గ్రంథాలయాలను’ ఏర్పాటు చేస్తోంది. ప్రఖ్యాత పుస్తకాలను పౌరులకు అందుబాటులో ఉంచడానికి సంకల్పించడం ముదావహం. గ్రామ పంచాయతీల్లో గ్రంథాలయాల నుంచి జాతీయ డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం వరకు అన్ని సదుపాయాలు పుస్తకపఠనాన్ని పెంచాలని ఉద్దేశించినవే అని తెలుసుకోవాలి.
దేశంలో అక్షరాస్యత రేటు కంటే విద్యావంతుల రేటు పెరిగితేనే దేశం అసలైన సుస్థిరాభివృద్ధిని పొందుతుంది. పుస్తక పఠనంతో మానసిక వికాసాన్ని పెంచుకోవాలి. యువత ఉద్యోగ, ఉపాధులను పొందడం జరగాలి. చదువుకున్నవారికి ప్రపంచవ్యాప్తంగా అవకాశాల ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. అనంత జ్ఞానం పుస్తకాల్లో నిక్షిప్తం కావడంతో దానిని ఆస్వాదించడానికి పఠన శక్తిని పెంచుకోవాలి.
చదవడమనే అలవాటు మెదడుకు చైతన్యం కలిగించడమే కాకుండా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి పునాదిగా కూడా పని చేస్తుంది. ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకుందాం. పుస్తకాలు అపార జ్ఞాన నిధులు, సంతోషానికి పునాదులు. ‘విద్య లేని వాడు వింత మనిషి అయితే విద్యావంతుడు అనంత శక్తిమంతుడు’ అని నమ్మాలి. నేటి విద్యావంతులందరూ ప్రాంతీయ భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాషా పుస్తకాలను చదువుతూ విద్యావేత్తలుగానే కాకుండా సంస్కారవంతులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
డిజిటల్ యుగంలో పుస్తక పఠనంతో మేధోసంపద
మంచి పుస్తకాన్ని చదివినపుడు పొందే అనుభూతి వర్ణనాతీతం. నేటి ఆధునిక, వేగవంతమైన జీవితంలో అనంత సమాచారం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. చదవడానికి తీరికలేకుండా ఆధునిక మనిషి జీవితం కొనసాగుతోంది. ఆఫ్‌లైన్‌లోగాని, ఆన్‌లైన్‌లోగాని చదవడం విధిగా అలవాటు చేసుకోవాలి. మనలోని సృజనను తట్టి లేపడానికి పుస్తక పఠనం ఇంధనంగా పని చేస్తుంది.
చరిత్రలో నిలిచిన వారందరూ చదువు మహిమను అవగతం చేసుకున్నవారే. ‘పుస్తకాలు నా మనసుకు దగ్గరైన నేస్తాలు, నా గృహమే వేల పుస్తకాలతో కూడిన గ్రంథాల దేవాలయం, పుస్తకాలే నా వద్ద ఉన్న అపూర్వ సంపద’ అంటూ భారతరత్న అబ్దుల్ కలాం అన్న వాక్యాలు మనం గుర్తుంచుకోవాలి. దేశ జనాభా అక్షరాస్యులైతే దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని మనం నమ్ముతున్నాం. దేశ అసలైన ఆస్తి మేధో సంపదే అని మనం గుర్తించాలి. జాతీయ విద్యావిధానం-2020 ఉద్దేశాల్లో విజ్ఞాన సమాజ స్థాపన, ప్రపంచస్థాయి మేధో సంపత్తి నిర్మాణం, ప్రపంచ విలువలను పెంపొందించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి