వార్నర్‌ ఆడింది చాలు.. నీ సేవలు అక్కర్లేదు..: ఆసీస్ మాజీ మహిళా కెప్టెన్

గతేడాది టెస్టుల నుంచి రిటైరై ఫ్రాంచైజీ క్రికెట్ బాట పట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఆ దేశ క్రికెట్‌లో చిచ్చు రేపాడు. 'స్వదేశంలో భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో నా అవసరం ఉంటే ఓపెనర్‌గా తిరిగి వస్తాను.. అందుకోసం నేను సిద్ధం..' అంటూ అతను చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. వార్నర్ మాజీ మాటలను బట్టి ఏడాది నుంచి ఆస్ట్రేలియా జట్టుకు సరైన ఓపెనర్ దొరకట్లేదా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో వార్నర్‌కు ఆసీస్‌ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లీసా స్థాలేకర్ ఘాటు కౌంటర్ ఇచ్చింది. 
  
సుధీర్ఘ ఫార్మాట్(టెస్టులు)కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన వార్నర్‌.. మరోసారి జట్టుకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని స్థాలేకర్.. వార్నర్‌ను విమర్శించింది. ఇకనైనా సెలెక్టర్లు ఇలాంటి మాటలను నమ్మకుండా యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని సూచించింది.

వార్నర్‌ ఇక చాలు..

"వార్నర్ మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. గతేడాది అతను అనూహ్యంగా టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో జట్టు కష్టాలు అతనికి గుర్తు రాలేదు. అనంతరం సెలక్టర్లు అతని నిర్ణయం పట్ల తెలివిగా వ్యవహరించలేకపోయారు. అందుకే ఈ కష్టాలు. కొత్త ఓపెనర్‌ను సిద్ధం చేయడం కష్టంగా మారింది. ఇప్పుడు వార్నర్ అవసరం ఉంటే తిరిగొస్తానని చేసిన వ్యాఖ్యలు సమస్యను తిరిగి మొదటికి తెస్తున్నాయి. స్వదేశంలో భారత్‌తో టెస్టు సిరీస్ అత్యంత కీలకం. వచ్చే ఏడాది చివరలో ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్ ఉంది. ఇప్పుడైనా ఓపెనింగ్‌ స్థానంపై క్రికెట్ ఆస్ట్రేలియా దృష్టి పెట్టాలి. వార్నర్‌ సేవలు ఇక చాలు.. ఓపెనర్‌గా అతని అవసరం ఆసీస్ జట్టుకు లేదనుకుంటాను .." అని స్థాలేకర్ విమర్శించింది

ALSO READ | IND vs NZ 2nd Test: సుందర్ 7 వికెట్లు.. ముగిసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

  • మొదటి టెస్ట్ (నవంబర్ 22 - 26): పెర్త్
  • రెండో టెస్ట్ (డిసెంబర్ 06 - 10): అడిలైడ్
  • మూడో టెస్ట్ (డిసెంబర్ 14 - 18): బ్రిస్బేన్
  • నాలుగో టెస్ట్ (డిసెంబర్ 26 - 31): మెల్బోర్న్
  • ఐదో టెస్ట్ (జనవరి 03 - 08): సిడ్నీ