ఆజాద్ కేసు : పోలీసులపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి

మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండేల ఎన్కౌంటర్పై అదిలాబాద్ జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న 29మంది పోలీసులపై పూర్తిస్థాయి విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదిలాబాద్ మున్సిఫ్ కోర్టును ఆదేశించింది. 

అసలేం జరిగింది..?

ఆదిలాబాద్ జిల్లాలో  2010 జూలై 1న వాంకిడి మండలం వెలిగి సర్కేపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత ఆజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు అనేక అనుమానాలను వ్యక్తం చేశాయి. దీనిపై విచారణ జరిపిన సీబీఐ.. అప్పటి ఏపీ పోలీసులకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.  నిజమైన ఎదురు కాల్పుల్లోనే ఆజాద్, హేమచంద్ర మరణించారని సీబీఐ నిర్ధారించిందని సుప్రీంకోర్టు ప్రకటించింది.

అయితే ఈ కేసు విషయమై కింది కోర్టులో అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సుప్రీం కోర్టు సూచించడంతో బాధితులు మరోసారి ఆదిలాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆదిలాబాద్ కోర్టులో విచారణ జరగగా.. న్యాయస్థానం తమ వాదనలు సరిగ్గా వినలేదని పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల వాదనలు కూడా వినాలన్న హైకోర్టు ఆదేశాలతో ఆదిలాబాద్ కోర్టు మరోసారి విచారణ చేపట్టింది.