- డీఎస్సీ పోస్టుల కేటాయింపులో అధికారుల నిర్లక్ష్యం
- ఎంక్వైరీకి ఆదేశించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్ సిటీ, వెలుగు: డీఎస్సీ టీచర్‌పోస్టుల భర్తీ సమయంలో స్కూళ్లలో టీచర్వేకెన్సీల లిస్ట్ సరిగ్గా ఇవ్వలేదని హైదరాబాద్ జిల్లాలోని కొందరు డిప్యూటీ ఈవో, డిప్యూటీ ఐవోఎస్‌లను జిల్లా అధికారులు విచారిస్తున్నారు. పోస్టింగులు సరిగ్గా జరగలేదని, టీచర్ల అవసరం ఉన్న స్కూళ్లను వదిలేసి, టీచర్లు ఉన్న స్కూళ్లలో మళ్లీ భర్తీ చేశారని కలెక్టర్అనుదీప్కు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్అడిషనల్కలెక్టర్ జ్యోతిని విచారణ అధికారిగా నియమించి, ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు.
రెండు రోజుల్లో కలెక్టర్ కు నివేదిక
విచారణ అధికారి జ్యోతి బుధవారం నుంచి విచారణ ప్రారంభించారు. డీఈవోఆర్ రోహిణీతో పాటు, ఖైరతాబాద్ డిప్యూటీ ఈవో, బండ్లగూడ, ముషీరాబాద్, అమీర్‌పేట్, గోల్కొండ, బహదూర్‌పురా, ఆసిఫ్ నగర్‌కు చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్స్కూల్స్ ను నాంపల్లిలోని డీఈవో ఆఫీసులో విచారించారు. ఆధికారుల నుంచి వివరాలను సేకరించారు. ఇందులో కొందరు అధికారులు గ్రూప్ 1 ఎగ్జామ్స్ డ్యూటీలో ఉండడం కారణంగా విచారణకు హాజరుకాలేకపోయారని తెలుస్తోంది. వారిని శుక్ర, శనివారాల్లో విచారించి, రిపోర్టును కలెక్టర్ అందించనున్నారు. నివేదిక ఆధారంగా నిర్లక్ష్యం వహించిన ఆధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోనున్నారు.