- దళితులపై రియల్టర్ దాడి..
- తమ సీలింగ్ ల్యాండ్స్ గుంజుకొని వెంచర్ వేశారని రైతుల ఆందోళన
- మాట్లాడుకుందామని పిలిచి రాళ్లతో కొట్టినరియల్ వ్యాపారి అనుచరులు
- పలువురు రైతులకు తీవ్ర గాయాలు
- పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదులు
- పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
- రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ఘటన
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లిపూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి రెచ్చిపోయాడు. ఏండ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కొని, అందులో వెంచర్ వేశారని పిగ్లిపూర్కు చెందిన దళితులు, మరికొంతమంది రైతులు ఆందోళన చేస్తున్నారు. మంగళవారం తమ భూములను దున్నుకునేందుకు ట్రాక్టర్లు తీసుకువెళ్లారు. దీంతో అక్కడే ఉన్న వెంచర్ నిర్వాహకుడు మెరుగు గోపాల్ యాదవ్ మాట్లాడుకుందామని వారిని పిలిచాడు.
వెళ్లగానే అతడి అనుచరులు సుమారు 100 మంది కర్రలు, రాడ్లతో రైతులపై దాడి చేశారు. రైతులు ప్రతిఘటించగా.. చేతికందిన రాళ్లతో రైతులను కొట్టారు. దీంతో మరో ఇద్దరు గాయపడగా, కొందరు అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అందరినీ దవాఖానకు తరలించి, చికిత్స అందించారు. అనంతరం బాధిత రైతులు అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కాగా, తమపై కూడా రైతులు దాడి చేశారని కొంతమంది పీఎస్ లో కంప్లయింట్ఇచ్చారు.
కాగా, రైతులపై దాడి చేసిన గోపాల్ యాదవ్ తో పాటు మరికొంత మందిపై ఎస్సీ,ఎస్టీ కేసుతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే, గోపాల్ యాదవ్ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదుతో రైతులపై ట్రెస్ పాస్తో పాటు దాడి చేసిన కేసు నమోదైంది.
సీలింగ్ భూమిని పట్టా భూమిలో కలుపుకున్నరని..
బాధితుల కథనం ప్రకారం..అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లిపూర్ రెవిన్యూ పరిధిలోని 17 సర్వే నంబర్ లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 386 ఎకరాల భూమి ఉంది. ఇందులో 75 ఎకరాలు భూదాన్ యజ్ఞ బోర్డ్ భూమి కాగా, మరో 61 ఎకరాల ప్రభుత్వ భూమి. ఇందులో 53 ఎకరాల సీలింగ్ భూమి,197 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇందులోని సీలింగ్ భూమిలో 16 మంది రైతులకు 45 ఎకరాలు ఉంది. ఈ భూమిని ఆ రైతులు వారి తాతలు, తండ్రుల కాలం నుంచి సాగుచేసుకుంటున్నారు.
ఇదే 17 సర్వే నంబర్ లోని 26 ఎకరాల ప్రైవేట్భూమిలో మెరుగు గోపాల్ యాదవ్ వెంచర్ వేసి, సీలింగ్ భూమిని కూడా కలుపుకున్నాడు. రైతులు పోలీస్ స్టేషన్, రెవెన్యూ అధికారుల చుట్టూ ఎంత తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. ధరణిలో చూస్తే సీలింగ్పట్టా అని చూపిస్తున్నది. బీఆర్ఎస్లీడర్లను, అప్పటి తహసీల్దార్, ఆర్డీవోతోపాటు కలెక్టర్ అమోయ్ కుమార్ను కలిసి ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా.. ఏం జరిగిందని కూడా అటు తొంగిచూడలేదు. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన నేతలతో రియల్టర్కు మంచి పరిచయాలు ఉండడంతో.. తమ భూములు బెదిరించి గుంజుకున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు.
అధికారులు రాకుండా కోర్టు ఆర్డర్స్..
జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బంది ఆ 26 ఎకరాల్లోకి రాకుండా రియల్టర్లు ఈ ఏడాది జనవరి 29న హైకోర్టు నుంచి నాట్ టు ఇంటర్ఫియర్ఆర్డర్ ను తీసుకువచ్చారు. దీంతో అధికారులు కూడా ఆ ల్యాండ్ లోకి వెళ్లడం లేదు. ఇదే సర్వే నంబర్ లోని కొంత ప్రైవేట్ భూముల్లో గతంలో ప్లాటింగ్ చేయగా, నాగేశ్వర్ హౌసింగ్ సొసైటీ కార్పొరేషన్ ఆ ప్లాట్లను కొన్నది. తర్వాత ల్యాండ్ విషయంలో వివాదం రావడంతో ఏడీ సర్వే కోసం నాగేశ్వర్ హౌసింగ్ సొసైటీ కార్పొరేషన్ కోర్టును ఆశ్రయించింది.
కాగా, సర్వే నంబర్17లో అసలు ఎన్ని ఎకరాల భూములున్నాయి? అనేది సర్వే చేసి తేల్చాలని ఈ ఏడాది జూన్ లో ఏడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ ఐదు నెలలు కావొస్తున్నా ఏడీ సర్వే చేయడం లేదు. కానీ, ఆయన అటెస్టేషన్చేయడంతో ఇప్పటికే వివాదంలో ఉన్న ఈ వెంచర్ కి హెచ్ఎండీఏ పర్మిషన్ కూడా వచ్చింది. ఇప్పటికే ఈ ల్యాండ్ పై నాట్ ఇంటర్ఫేర్ఆర్డర్స్ ఉండగా.. దీనిపై ఇప్పుడు ఉన్న రెవిన్యూ అధికారులు స్టే వేకెట్ పిటిషన్హై కోర్టులో దాఖలు చేశారు.
మాకు దిక్కెవరు?
నా చిన్న తనం నుంచి ఆ భూమినే మేం సాగు చేసుకొని బతికినం. మా భూమి ఇప్పుడు మాది కాదని అంటున్నరు. మేం పిల్లలుగా ఉన్నప్పుడు అంతా కలిసి రాళ్లు రప్పలు కొట్టినం. ఎక్కడికి పోయినా ఎవ్వ లూ మాకు న్యాయం చేయడం లేదు. ఇప్పు డు కబ్జా చేసినోళ్లు మా ప్రాణాలు తీసేటట్టు ఉన్నరు. మమ్మల్ని కాపాడే దిక్కెవ్వలు.
- మల్లమ్మ, బాధితురాలు పిగ్లిపూర్ గ్రామం