ఇద్దరూ ఒక్కరే
టైటిల్ : గురువాయూర్ అంబలనడయిల్
ప్లాట్ ఫాం : డిస్నీ+హాట్‌స్టార్
డైరెక్షన్ : విపిన్ దాస్
కాస్ట్ : పృథ్వీరాజ్ సుకుమారన్, బసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగిబాబు, బిజు సంతోష్, అజు వర్గీస్, ఇర్షద్
విను (బేసిల్ జోసెఫ్) దుబాయిలో ఉద్యోగం చేస్తుంటాడు. అతను గతంలో పార్వతి (నిఖిలా విమల్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ లవ్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత ఐదేండ్ల పాటు ఆ జ్ఞాపకాలతోనే బతికేస్తాడు. పార్వతి తనని మోసం చేసిందని అందరికీ చెప్తుంటాడు. ఆ తర్వాత వినుకి అంజలి (అనస్వర రాజన్)తో నిశ్చితార్థం జరుగుతుంది. పెండ్లి చేసుకునేందుకు కేరళకు వచ్చేందుకు సిద్ధం అవుతుంటాడు. ఈ పెండ్లి జరగడానికి కారణం ఆనందన్ (పృథ్వీరాజ్ సుకుమారన్). వినుకు గతంలో ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉందని తెలిసినా అతని మనసు మార్చి మరీ పెండ్లికి ఒప్పిస్తాడు. తన చెల్లి అంజలితో పెండ్లి చేసేందుకు రెడీ అవుతాడు. అందుకే ఆనందన్‌తో చాలా క్లోజ్‌గా ఉంటాడు విను. అప్పటికే ఆనందన్‌కు పెళ్లయ్యి ఒక బాబు ఉంటాడు. కానీ.. అతని లైఫ్ కూడా అంత హ్యాపీగా ఉండదు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.. విను ప్రేమించిన అమ్మాయినే ఆనందన్ పెళ్లి చేసుకుంటాడు. కానీ.. కొన్ని గొడవల వల్ల పార్వతి పుట్టింటికి వెళ్లిపోతుంది. అది తెలిసిన విను... తన గర్ల్‌ఫ్రెండ్‌ని మర్చిపోయేలా చేసి, తన సంతోషానికి కారణమైన ఆనందన్‌ని అతని భార్యతో కలపాలి అనుకుంటాడు. అందుకే తన పెళ్లికి ఆనందన్ భార్యతోపాటు ఆమె ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేయమని ఆనందన్‌కి చెప్తాడు. విను చెప్పినట్టే పార్వతిని ఇంటికి తీసుకొస్తాడు ఆనందన్. ఆ సంతోషాన్ని పంచుకునేందుకు దుబాయి నుండి రాగానే ముందుగా ఆనందన్‌ను కలవడానికి వెళ్తాడు విను. అప్పుడే అతనికి తాను ప్రేమించిన అమ్మాయి, ఆనందన్ భార్య ఒకరే అని తెలుస్తుంది. ఆ తర్వాత విను ఏం చేశాడు? విను, అంజలిల పెళ్లి జరిగిందా? లేదా? ఆనందన్‌కి అసలు విషయం తెలిసిందా?
అది హత్యా!
టైటిల్ : రౌతు కా రాజ్
ప్లాట్ ఫాం : జీ5
డైరెక్షన్ : ఆనంద్ సురపూర్
కాస్ట్ : నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాజేష్ కుమార్, అతుల్ తివారీ, నారాయణి శాస్త్రి
ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో రౌతు అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలోని అంధుల హాస్టల్‌లో వార్డెన్‌గా పనిచేసే సంగీత (నారాయణి శాస్త్రి) అకస్మాత్తుగా చనిపోతుంది. ఆ ఊళ్లో15 ఏండ్లుగా ఒక్క హత్య కూడా జరగలేదు. అందుకే ఆమెది సహజ మరణం అని నమ్ముతారు అక్కడి వారంతా. కానీ.. ఆ ప్రాంతంలో ఎస్.హెచ్.వో. (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా పనిచేస్తున్న దీపక్ నేగి (నవాజుద్దీన్ సిద్ధిఖీ)కి మాత్రం ఆమె మరణం గురించి చాలా అనుమానాలు ఉంటాయి. అక్కడివాళ్లు మాత్రం గుండెపోటు వల్లే చనిపోయిందని వాదిస్తారు. అంతేకాదు.. దీపక్‌తో పనిచేస్తున్న మరో పోలీస్ డిమ్రీ (రాజేష్ కుమార్) కూడా ఆమెది సహజ మరణమనే అంటాడు. కానీ.. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆ వార్డెన్ అసహజ కారణాల వల్ల చనిపోయిందని తెలుస్తుంది. ఆ హత్య ఎలా జరిగింది? దానికి కారణం ఎవరు? అనే వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాలి.
రాజకీయ ప్రేమ కుట్ర!
టైటిల్ : ఉయిర్ తమిళుక్కు
ప్లాట్ ఫాం : ఆహా తమిళం
డైరెక్షన్ : ఆడమ్ బావా
కాస్ట్ : అమీర్ సుల్తాన్, చాందిని శ్రీధరన్, ఇమ్మాన్ అన్నాచ్చి, ఆనందరాజ్, రాజసిమ్మన్, మహానది శంకర్
ప్రముఖ రాజకీయ నాయకుడు పజకడై రామచంద్రన్ (ఆనంద్‌రాజ్) హత్యతో సినిమా మొదలవుతుంది. ఆయన హత్య వల్ల అక్కడి పరిస్థితి గందరగోళంగా మారిపోతుంది. రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ పెరుగుతుంది. పాండియన్ (అమీర్) రామచంద్రన్ స్థానాన్ని దక్కించుకోవాలి అనుకుంటాడు. ప్రజల మనసులు గెలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. ముఖ్యంగా రామచంద్రన్ కూతురు తమిళసెల్వి (చాందిని శ్రీధరన్)ని ప్రేమలో పడేసేందుకు ఉన్న అన్ని మార్గాలు వెతుకుతాడు. కానీ.. ఆమె అదంతా పాండియన్ పన్నిన కుట్ర అనుకుంటుంది. ఆ తర్వాతేం జరిగింది? పాండియన్ ప్రేమలో తమిళసెల్వి పడిందా? లేదా? అతనికి అధికారం దక్కిందా?
ఒక్కొక్కరిది ఒక్కో కథ
టైటిల్ : శర్మాజీకి బేటీ
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్షన్ : తాహిరా కశ్యప్ ఖురానా
కాస్ట్ : సాక్షి తన్వర్, దివ్య దత్తా, సయామి ఖేర్, వంశిక తపారియా, అరిస్టా మెహతా, షరీబ్ హష్మీ, పర్విన్ దబ్బాస్
మూడు వేర్వేరు కుటుంబాల కథ ఇది. ఐదుగురు ఆడవాళ్ల జీవితాన్ని ఇందులో చూపించారు. స్వాతి శర్మ (వంశిక తపారియా), గుర్వీన్ శర్మ (అరిస్టా మెహతా) ఎటువంటి దాపరికం లేకుండా మనసు విప్పి మాట్లాడుకునేంత క్లోజ్ స్కూల్ ఫ్రెండ్స్. ఇద్దరి వయసు13 ఏండ్లు. ఆ వయసులో వచ్చే మార్పుల వల్ల వాళ్ల జీవితాల్లో కొంత గందరగోళం మొదలవుతుంది. స్వాతి తల్లి జ్యోతి శర్మ (సాక్షి తన్వర్) నిజాయితీ గల ట్యూషన్ టీచర్. ఆమె భర్త సుధీర్ (షరీబ్ హష్మీ)తో కలిసి ఇంటి బాధ్యతలు పంచుకుంటుంది. గుర్వీన్ తల్లి కిరణ్ శర్మ (దివ్య దత్తా) పాటి యాలాలో పుట్టి, పెరిగిన సంపన్న కుటుంబానికి చెందిన గృహిణి. కానీ.. వాళ్ల కుటుంబం ముంబయిలో సెటిల్ కావడంతో ఆ వాతావరణానికి అలవాటు పడటానికి కష్టపడుతుంటుంది. కిరణ్.. ఆమె భర్త (పర్విన్ దబ్బాస్) మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయి. దాంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రంజీ క్రికెటర్ తన్వీ శర్మ (సయామీ ఖేర్)కు ఒక అందమైన బాయ్‌ఫ్రెండ్ ఉంటాడు. కానీ.. అతనెప్పుడూ ఆమెని, ఆమె ఆడే విధానాన్ని విమర్శిస్తుంటాడు. అందుకే తనకు అతను సరిపోడని నమ్ముతుంది. వీళ్లంతా.. తమ జీవితంలో ఏదో ఒక సమస్యతో పోరాడుతున్నవాళ్లే. ఆ సమస్యలను వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? అనేదే అసలు కథ.
కిడ్నాప్ జరిగిందా?
టైటిల్ : అహం - రీబూట్
ప్లాట్ ఫాం : ఆహా, కాస్ట్ : సుమంత్
డైరెక్షన్ : ప్రశాంత్ సాగర్ అట్లూరి
నిలయ్(సుమంత్) ఫుట్‌బాల్ ప్లేయర్ కావాలని కలలు కంటుంటాడు. కానీ.. ఒక యాక్సిడెంట్ వల్ల అతని జీవితం తారుమారు అవుతుంది. అదే యాక్సిడెంట్‌లో నిలయ్ వల్ల ఒక అమ్మాయి చనిపోతుంది. తన వల్ల ఒక ప్రాణం పోయిందని చాలా బాధ పడుతుంటాడు. ఆ బాధలో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఆ బాధ నుంచి బయటికి వచ్చేందుకు రేడియో జాకీగా మారతాడు. అప్పుడు ఒక రోజు రేడియో స్టేషన్‌కు ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తుంది. దాంతో ఆమె మాటలను రేడియో లైవ్‌లో వినిపిస్తాడు. ఆ మాటలు విన్న పోలీసులు ఆ అమ్మాయి నిజంగానే కిడ్నాప్ అయ్యిందని నమ్మి.. కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తారు. పైగా ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు సేకరించే బాధ్యతను నిలయ్‌కు అప్పగిస్తారు. రేడియో స్టేషన్ నుంచి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎక్కడ ఉంచారు? అనే సమాచారాన్ని నిలయ్ ఎలా సేకరించాడు? నిజంగానే ఆ అమ్మాయి కిడ్నాప్ అయ్యిందా? ఇంతకీ ఆమె ఎవరు? పోలీసులు ఆమెను కాపాడారా? లేదా?
రెస్టారెంట్ కోసం..
టైటిల్ : ద బేర్ సీజన్ 3
ప్లాట్ ఫాం : డిస్నీ+ హాట్‌స్టార్
డైరెక్షన్ : క్రిస్టోఫర్ స్టోర్
కాస్ట్ : జెరెమీ అలెన్ వైట్, ఎబోన్ మోస్-బచ్రాచ్, అయో ఎడెబిరి, లియోనెల్ బోయ్స్, లిజా కొలోన్-జయస్, అబ్బి ఇలియట్
కార్మెన్ అలియాస్ కార్మీ (జెరెమీ అలెన్ వైట్) హెడ్ చెఫ్‌గా పనిచేస్తుంటాడు. అతని బిజినెస్ పార్ట్‌నర్ సిడ్నీ (అయో ఎడెబిరి)తో కలిసి సొంత రెస్టారెంట్ పెట్టుకుంటాడు. అప్పటినుంచి కార్మీ రెస్టారెంట్‌ని డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ముఖ్యంగా డైనింగ్‌లో రకరకాల మార్పులు చేస్తుంటాడు. రెస్టారెంట్‌ని కాపాడుకోవడానికి, డెవలప్ చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నింటిని ఎదుర్కొని రెస్టారెంట్‌ని నడిపించారా? లేదా? అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేదే ఈ వెబ్‌సిరీస్.