- ఎంటమాలజీ విభాగం రాంకీ చేతిలోకి..!
- సీ అండ్ టీ తరహాలో అప్పగించేందుకు రంగం సిద్ధం!
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కొద్దికొద్దిగా ప్రైవేట్ పరం అవుతోంది. ఇప్పటికే చెత్త కలెక్షన్ అండ్ ట్రాన్స్ పోర్టేషన్, కమర్షియల్ రోడ్లపై చెత్త క్లీనింగ్, సీఆర్ఎంపీ రోడ్లు ఇలా ఎన్నో బాధ్యతలను జీహెచ్ఎంసీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. తాజాగా బల్దియాలోని ఎంటమాలజీ విభాగాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు, సిటీలోని చెత్త తరలింపు(సీ అండ్ టీ), కమర్షియల్ రోడ్ల క్లీనింగ్ చూస్తున్న రాంకీ సంస్థకే ఎంటమాలజీ విభాగాన్ని అప్పగించాలని ప్లాన్చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారులు ఓ దఫా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే దోమల నివాణ చర్యలు ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్తారు. అలాగే ఎంటమా లజీ విభాగంలో పనిచేస్తున్న 2,400 మంది వర్కర్లు, ఎస్ఎఫ్ఏలను కూడా అదే సంస్థ పరిధిలో పనిచేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు త్వరలో ఒప్పందం జరగనున్నట్లు జీహెచ్ఎంసీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ అంశంపై జీహెచ్ఎంసీ వెనక్కి తగ్గాలని, ఇప్పటికే ఎంతో మంది కార్మికులు నష్టపోతున్నారని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
అంతా ప్రైవేట్ పరమే..
జీహెచ్ఎంసీ ఖజానా రోజురోజుకు ఖాళీ అవుతోంది. సొంతగా పనులు చేయకుండా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడమే ఓ కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికే రాంకీతోపాటు పలు ఏజేన్సీలు బల్దియా పరిధిలో వివిధ పనులను చేయిస్తున్నాయి. గతంలో సొంతంగా చేయించిన బల్దియా అధికారులు కొన్నేళ్లుగా ఒక్కొక్కటిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఇప్పుడు దోమల నివారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంటమాలజీ వింగ్‌ను కూడా ప్రైవేట్ చేతిలో పెట్టాలని చూస్తున్నారు. ఒప్పందం కుదిరితే దోమల నివారణకు సక్రమంగా చర్యలు తీసుంటారా? లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో చెత్త తరలింపు సరిగా లేదని, డైలీ సేకరించడం లేదని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆ బాధ్యతలు చూస్తున్న రాంకీకే ఎంటమాలజీ విభాగాన్ని ఇవ్వాలని చూడడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.
ఖర్చు పెరుగుతుందనే..
గ్రేటర్ పరిధిలో దోమల నివారణకు జీహెచ్ఎంసీ కోట్లు ఖర్చు చేస్తోంది. రెండేళ్లుగా ఫాగింగ్ కోసం రూ.36 కోట్లు ఖర్చు పెట్టింది. దాదాపుగా ఒక్కో సిటిజన్ పై ఏడాదికి రూ.2వేలు చొప్పున ఖర్చు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. దోమల బెడద తగ్గడం లేదని జనం చెబుతూనే ఉన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న విభాగాన్ని ప్రైవేట్ సంస్థకు ఇవ్వాలని చూడడంపై విమర్శలు వస్తున్నాయి. ఖర్చు ఎక్కువ అవుతుండడమే కారణమని తెలుస్తోంది.
సీఎం దృష్టికి తీస్కపోతం
జీహెచ్ఎంసీ ప్రైవేట్ పరం అవుతున్న విషయం సీఎం కేసీఆర్‌కు తెలియకుండా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయనకు తెలిస్తే ఇటువంటివి చేయకుండా చూస్తారనే నమ్మకం ఉంది. గతంలో బల్దియాలోని కార్మికులను పర్మినెంట్ చేస్తామని చేయలేదు. బల్దియాను కొద్దికొద్దిగా రాంకీ చేతిలో పెట్టి కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో పనులు అప్పగించారు. ఇప్పుడు ఎంటమాలజీ విభాగాన్ని అప్పగించాలని చూడడం దారుణం. కార్మికుల పక్షాన సీఎంకు బహిరంగ లేఖ రాస్తా. - ఊదరి గోపాల్, జీహెచ్ఎంఈయూ ప్రెసిడెంట్