హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 194 సర్కారు మోడల్ స్కూళ్లలో 2022–23 విద్యా సంవత్సరానికిగాను అడ్మిషన్ల కోసం ఏప్రిల్ 17న అడ్మిషన్ టెస్టు నిర్వహిస్తున్నట్టు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి తెలిపారు. 6వతరగతిలో మొత్తం సీట్లకు, ఏడు నుంచి పదో తరగతి వరకు మిగిలి ఉన్న సీట్లకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ కోసం మొత్తం 73,201 అప్లికేషన్లు పెట్టుకున్నారని చెప్పారు. 6వ తరగతిలో 19,400 సీట్లకు.. 39,505 మంది, 7 నుంచి 10వ తరగతి వరకూ మిగిలిన సీట్లకు 33,696 మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. 6వ తరగతి అడ్మిషన్‌కు అప్లికేషన్ పెట్టుకున్న స్టూడెంట్లకు ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10వ తరగతి వరకు అప్లై చేసుకున్న వాళ్లకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని వెల్లడించారు. పోయినేడాది అడ్మిషన్ల కోసం 40 వేల మంది మాత్రమే అప్లికేషన్ పెట్టుకున్నారు.