స్టూడెంట్స్ లో ఆందోళన
షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచే పరీక్షలు
కరోనా ఎఫెక్ట్ తో నిర్వహణ కష్టమంటున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరగాల్సిన ఎంట్రెన్స్ టెస్టులపై సస్పెన్స్ నెలకొన్నది. బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలు.. కరోనా ఎఫెక్ట్ తో జరుగుతాయా ..? లేదా..? అనే టెన్షన్ సూడెంట్స్ లో నెలకొంది. అయితే పరీక్షలను నిర్వహిస్తామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చెప్తోంది. కానీ నిర్వహించే అధికారుల్లో మాత్రం కొంత అయోమయం నెలకొన్నది. పరీక్షల నిర్వహణ టైంలో ఎవరికైనా కరోనా వస్తే, తమకు బ్యాడ్ రిమార్క్ వస్తుందనే భయంలో వారు ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో మే నెలలో ఎంట్రెన్స్ టెస్టులు జరగాల్సి ఉండె. కానీ కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ తో వాటిని జులైలో నిర్వహిస్తామని అప్పట్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకటించింది. దీని ప్రకారం జులై 1న పాలిసెట్ తో పాటు పీజీ ఈసెట్ పరీక్ష ప్రారంభం కావాలి. జులై 4న ఈసెట్, జులై 6 నుంచి 9 వరకూ ఎంసెట్, 10న లాసెట్, పీజీ లాసెట్, 13న ఐసెట్, 15న ఎడ్ సెట్ పరీక్షలు ఉన్నాయి. అయితే కరోనా విస్తరిస్తున్నందున ఈ పరీక్షలు ఉంటాయా..? ఉండవా..? అనే ఆందోళన స్టూడెంట్స్ లో కొనసాగుతోంది.
హైకోర్టు లో పిల్.. నేడు విచారణకు వచ్చే చాన్స్
కరోనా కేసులు పెరుగుతున్నందున ఎంట్రెన్స్ టెస్టులను రద్దు చేయాలని స్టూడెంట్ యూనియన్ నేతలు హైకోర్టులో పిల్ వేశారు. అది మంగళవారం హైకోర్టు బెంచ్ ముందుకు వచ్చే చాన్స్ ఉంది. పరీక్షలు నిర్వహించాలనే వాదనలను హైకోర్టులోనూ వినిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే హైకోర్టు అనుమతి ఇస్తేనే.. ఎంట్రెన్స్ టెస్టులు ఉంటాయని ఆఫీసర్లు చెప్తున్నారు. పైగా త్వరలోనే హైదరాబాద్లో లాక్ డౌన్ పెడ్తామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. దీంతో పరీక్షల నిర్వహణపై గందరగోళం నెలకొంది.
నిర్వహిస్తామంటున్న ఉన్నత విద్యామండలి
ఎంట్రెన్స్లను నిర్వహిస్తామని హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. సెంటర్లను రోజూ శానిటైజ్ చేస్తామని, స్టూడెంట్లు తప్పనిసరిగా మాస్కు పెట్టుకునేలా చూస్తామని, ఫిజికల్ డిస్టెన్స్ అమలు చేస్తామని అంటున్నారు. షెడ్యూల్స్ ప్రకారం జులై 1న పాలిసెట్ తో పాటు పీజీఈసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. పాలిసెట్ కు 64,454 మంది హాజరుకావాల్సి ఉంది. వారి కోసం 250 సెంటర్లను సిద్ధం చేశారు. జులై 1 నుంచి 4 వరకూ పీజీఈసెట్ జరగాలి. ఈ పరీక్షకు 22 వేలమంది హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం కేవలం 13 సెంటర్లను సిద్ధం చేశారు. అయితే అవి కూడా కేవలం హైదరాబాద్, వరంగల్లో ఉన్నాయి.