ఇటీవలే 10- నిమిషాల అంబులెన్స్ సర్వీస్‌ను ప్రారంభించిన ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌కు డాట్ కంపెనీ వ్యవస్థాపకుడు, కంటెంట్ క్రియేటర్ హర్ష్ పంజాబీ మరో వినూత్న ఐడియా ఇచ్చాడు. యూపీఐ చెల్లింపుకు బదులుగా 10 నిమిషాలలోపు వినియోగదారుల ఇళ్లకు నేరుగా నగదును డెలివరీ చేసే సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై ఆలోచించాలని బ్లింకిట్‌కు సూచించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టిన హర్ష్ పంజాబీ.. ఈ ట్వీట్‌ను బ్లింకిట్ వ్యవస్థాపకుడు, సీఈవో అల్బిందర్ ధిండ్సాకు ట్యాగ్ చేశాడు.
‘‘నేను ట్రిప్‌కు వెళ్లబోతున్నా. ఇంట్లో కేవలం రూ.100 నగదు మాత్రమే ఉంది. లిక్విడ్ క్యాష్ కోసం ఏటీఎంకు వెళ్లాలనుకోవడం లేదు. కానీ నాకు ఇప్పుడు క్యాష్ కావాలి” అని తనకు ఈ ఆలోచనకు రావాడానికి గల కారణాన్ని హర్ష్ పంజాబీ వివరించాడు. ఒకసారి ఈ ఆలోచనను ట్రై చేయాలని.. 10 నిమిషాల్లోపు ఇంటి వద్దకు వచ్చే నగదు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. హర్ష్ పంజాబీ ప్రతిపాదనపై నెటిజన్లు భిన్నంగా స్పందింస్తున్నారు. కొందరు దీనిని సమర్థిస్తుండగా.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు.
ఈ కామర్స్ సంస్థలతో ఇప్పటికే ప్రజలు బద్దకస్తులు అవుతున్నారు.. ఈ సర్వీస్‌తో వారు ఇంకొంత బద్దంగా తయారు అవుతారని ఒకరు.. ఇప్పటికే ఇలాంటి సర్వీసులు ఉన్నాయని.. కానీ బ్యాంకింగ్ లైసెన్స్ లేకుండా ఇవి పని చేయవని, తరచుగా రోజువారీ పరిమితి సమస్యలకు గురవుతాయని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘క్యాష్ ఆన్ డెలివరీ’ అంటూ మరో నెటిజన్ సెటైర్ వేయగా.. ఈ సర్వీస్ చాలా ప్రమాదకరమని.. లాజిస్టిక్స్ సంస్థలు లిక్విడ్ క్యాష్‌ను నిర్వహించడం చాలా డేంజర్ అని ఇంకో నెటిజన్ అన్నాడు. మరో దీనిపై బ్లింకిట్ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.