రాత్రి 10 తర్వాతే సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఎంట్రీ: అడిషనల్ సీపీ విశ్వ ప్రసాద్

హైదరాబాద్: రాత్రి 10 గంటల తర్వాతే సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు అనుమతి ఉంటుందని అడిషనల్ సీపీ ట్రాఫిక్ విశ్వ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎక్కించుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు సిటీలో కొన్ని హాల్టింగ్ పాయింట్స్ పెట్టుకున్నారన్నారు. కొన్నిచోట్ల రాత్రి వేళ వరుసగా బస్సులు రావడంతో సిటీలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని.. రానున్న రోజుల్లో బస్సు ట్రావెల్స్ ట్రాఫిక్ రద్దీని  తగ్గించేందుకు యాజమాన్యంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉదయంతో  పోల్చుకుంటే రాత్రి కూడా ట్రాఫిక్ రద్దీ యధావిధిగా ఉంటుందన్నారు. నగరంలో ఉదయం వేళలో కూడా ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని.. ముఖ్యంగా వితౌట్ హెల్మెట్, రాంగ్ డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టామని పేర్కొన్నారు. 

వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని సీపీ తేల్చి చెప్పారు. హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెరిగాయని.. అక్టోబర్ నాటికి 48,500 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఇందులో 42,000 మంది టూవీలర్స్ కేసులే ఉన్నాయన్నారు. పలు మార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన కొందరి తీరు మారడం లేదని.. మరికొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. వీకెండ్ ఎండ్ రోజుల్లో సిటీలోని పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‎లు నిర్వహిస్తున్నామని చెప్పారు. 

శనివారం తెల్లవారుజూమన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఏర్పాటు చేశామన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‎లోని పబ్బులు, రెస్టారెంట్లు, బార్లలో ఎస్టాబ్లిష్మెంట్ పార్కింగ్ లేకుండా వాలెట్ పార్కింగ్ పేరుతో రోడ్లమీద కస్టమర్ల వాహనాలు పార్కింగ్ చేస్తున్నట్లు  గుర్తించామని తెలిపారు. ముఖ్యంగా ఇవాళ (శనివారం) రాంగ్ పార్కింగ్ మీద డ్రైవ్ చేశామని.. ట్రాఫిక్స్ రూల్స్‎కు విరుద్ధంగా పార్క్ చేసిన సుమారు 50  నుంచి 100 వాహనాలకు లాక్ వేశాముని తెలిపారు.