హనుమకొండ, వెలుగు : వరంగల్ అభివృద్ధిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దాస్యం వినయ్ భాస్కర్ నగరాన్ని 40 ఏండ్లు వెనక్కి నెట్టారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. హనుమకొండ వడ్డేపల్లి ఎన్జీవోస్ కాలనీలోని తన క్యాంప్ ఆఫీస్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ వరంగల్‌కు స్మార్ట్ సిటీ నిధులు మంజూరు చేసి పూర్వవైభవం తీసుకొస్తున్నారన్నారు.
మోదీ పర్యటనకు హాజరుకాని సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎంపీ దయాకర్‌కు ఎంత కోచింగ్ ఇచ్చినా కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం రావడం లేదని, అందుకే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్‌కుమార్‌ను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పొత్తులో ప్రభుత్వం ఏర్పడినప్పుడు గుర్తుకురాని కోచ్ ఫ్యాక్టరీ ఇప్పుడెందుకు గుర్తొచ్చిందని ప్రశ్నించారు.
కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, ఓవర్ హాలింగ్ ప్రాజెక్ట్‌కు 160 ఎకరాలు కావాలని చెప్పి ఆరేండ్లు దాటినా ఇంతవరకూ స్థలం కేటాయించలేదని మండిపడ్డారు. సమావేశంలో కార్పొరేటర్ లావుడ్య రవినాయక్, బీజేపీ నాయకులు శివ, నిరంజన్ పాల్గొన్నారు.