
వరంగల్ సిటీ, వెలుగు: కాలనీలో సమస్యల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొద్దిరోజుల కింద బీఆర్ఎస్ 29వ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదంత్ ఇంటి ముందు ఖాళీ కుండలతో కొంతమంది కాలనీవాసులు నిరసన వ్యక్తం చేయగా.. అందులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ వద్ద మంగళవారం రాకేశ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే కేసులు పెడితే.. మరి సమస్యలను పరిష్కరించకపోతే ఏం చేయాలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సమాధానం చెప్పాలన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడితే.. వరంగల్ లో గల్లీగల్లీ గళమెత్తుతుందన్నారు.
ప్రజా సమస్యలు తీర్చలేనప్పుడు ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు ఎమ్మెల్యేకు లేదన్నారు. వందల ఏళ్లు కాకతీయుల రాజధానిగా విలసిల్లిన నగరం.. ఇప్పుడు నీళ్లు, రోడ్లు, డ్రైనేజీల్లేక విలపిస్తోందన్నారు. వరంగల్ నగరం తిరుగుబాటుకు పెట్టింది పేరని, తొందర్లోనే తగిన గుణపాఠం చెబుతారన్నారు. అనంతరం పార్టీ సీనియర్‌నాయకుడు కుసుమ సతీశ్మాట్లాడుతూ వరంగల్ లో పాలక పక్షం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ప్రశ్నించిన ప్రజలపైన కేసులు పెట్టడమంటే.. దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.