సర్వే చేసిన ఎన్యూమరేటర్లకు జీతాల్లేవ్!

సర్వే చేసిన ఎన్యూమరేటర్లకు జీతాల్లేవ్!
  • 18,419 ఎన్యూమరేటర్లు, 1,745 సూపర్ వైజర్లకు రూ.20 కోట్లు పెండింగ్
  • మూడు నెలలైనా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించిన ఎన్యూమరేటర్లకు నేటికీ జీతాలు పడలేదు. గతేడాది నవంబర్ 6న ప్రారంభమైన సర్వే అదే నెల30న ముగిసింది. అయితే, ఇప్పటివరకు జీతాలివ్వకపోవడంతో ఎప్పుడిస్తారా అని ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ పరిధిలో నిర్వహించిన సర్వే లో 18,419 మంది ఎన్యూమరేటర్లు, 1,745 మంది సూపర్ వైజర్లు పాల్గొన్నారు. ఎన్యూమరేటర్లలో ప్రభుత్వ టీచర్లు, ఆశా వర్కర్లు, విద్యార్థులు ఉన్నారు.

 సర్వేకు గానూ ఒక్కో ఎన్యూమరేటర్ కు రూ.10 వేలు, సూపర్ వైజర్ కు రూ.12 వేలుగా చెల్లించాల్సి ఉంది. అందరికీ కలిపి దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి దాదాపు 3 నెలలు గడుస్తున్నా జీతం సంగతి మాత్రం తేల్చడం లేదు. దీనిపై బల్దియా అధికారులను వివరణ కోరగా నిధులు రాకపోవడంతోనే చెల్లించలేదని చెబుతున్నారు.