
- ప్రాజెక్టు అనుమతులను నిర్లక్ష్యం చేసిన ఫలితం
- పర్యవేక్షణ కోసం కట్టపై 12 సీసీ కెమెరాల ఏర్పాటు
- ఎన్నికల వేళ ప్రాజెక్టు ఓపెనింగ్‌పై నీలి నీడలు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టుకు పర్యావరణ చిక్కులు తొలగడం లేదు. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ప్రాజెక్టును ప్రారంభించాలని బీఆర్ఎస్సర్కార్భావిస్తుండగా ఎన్జీటీ(నేషనల్గ్రీన్ట్రిబ్యునల్) షాక్ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో పనుల ఆపాలని నాలుగు సార్లు ఆర్డర్లు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో జీఆర్ఎంబీ(గోదావరి రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు) ఆధ్వర్యంలో గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట వద్ద 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించింది. ప్యాచ్ వర్క్స్ ను ఆపించింది. అయితే ఈ ఏడాది మే నెలలో గౌరవెల్లి నిర్వాసితులైన బద్దం భాస్కర్‌రెడ్డి, కొత్త సంజీవరెడ్డి, ఉస్కె సురేందర్ రెడ్డి, రాగి శివ ఎన్జీటీని ఆశ్రయించారు.
నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వలేదని, రీ డిజైన్‌కు అవసరమైన పర్యావరణ అనుమతులు తీసుకోలేదని, ప్రాజెక్టు డీపీఆర్ ను బయటికి చూపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ బెంచ్ అదే నెలలో పనులు ఆపాలని ఆదేశించింది. అవేం పట్టించుకోకుండా అధికారులు గుడాటిపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించారు. కట్ట పనులు షురూ చేశారు.
రీడిజైన్‌కు 30కి పైగా అనుమతులు పెండింగ్
గౌరవెల్లి ప్రాజక్టు రీడిజైన్ కు 30కి పైగా పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసింది. పనులు ఆపాలని నాలుగు సార్లు ఎన్జీటీ నుంచి ఆర్డర్లు వచ్చినా ఖాతరు చేయలేదు. గుడాటిపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించి కట్ట నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా పిటిషనర్లు ఎన్జీటికి సమర్పించారు. విచారణ చేపట్టిన ఎన్జీటీ బెంచ్ రాష్ట్ర అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా, ట్రయల్‌రన్‌లో భాగంగా ఆగస్టు18 నుంచి 23 వరకు మూడు పంపులతో గౌరవెల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తి పోశారు. ఆ విషయాన్ని పిటిషనర్లు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్జీటీ ఆదేశాలతో జీఆర్ఎంబీ రంగంలోకి దిగింది. గత నెల 28న బోర్డు అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేపట్టింది. పనులు జరుగుతున్న విషయం నిజమేనని రిపోర్టు ఇచ్చింది. సీరియస్‌గా తీసుకున్న ఎన్జీటీ వెంటనే ప్రాజెక్టు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. పనులు జరగకుండా చూడాలని ఆదేశించింది. ప్రాజెక్టు కట్ట వద్ద మొత్తం 12 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఎన్ని చెప్పినా బెంచ్ ఒప్పుకోలే..
ప్రాజెక్టు వద్ద చిన్న చిన్న ప్యాచ్ వర్క్‌లు మాత్రమే నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్లీడర్లు ఎన్జీటీ ముందు చెప్పినా బెంచ్ ఒప్పుకోలేదు. కట్ట రివిట్మెంట్, రిటైనింగ్ వాల్, ప్రాజెక్టులోకి నీళ్లు వదలడం ప్యాచ్ వర్క్‌లు ఎలా చేస్తారని నిలదీసింది. ఎలాంటి పనులు జరగకుండా చూడాలని ఆదేశించింది. దీంతోనే గోదావరి బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు బిగించారు. దీంతో ఎన్నికల ముందు ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించి ఓట్లుప్రయోజనం పొందాలని చూసిన బీఆర్ఎస్ పార్టీ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తవగా, అధికారులు మూడు భారీ మోటార్ల సాయంతో ట్రయల్ రన్ ను సక్సెస్ చేశారు. దాదాపు టీఎంసీ నీటిని రిజర్వాయర్‌లోకి వదిలి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న టైంలో ఎన్జీటీ బ్రేక్ వేయడంతో పరేషాన్లో పడిపోయారు.
పుష్కర కాలంగా పనులు
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పుష్కర కాలంగా సాగుతున్నాయి. 2009లో 1.45 టీఎంసీల కెపాసిటీతో ప్రాజెక్టు నిర్మించాలని భావించి, 1,800 ఎకరాలను సేకరించి పనులు ప్రారంభించింది. 2015లో సీఎం కేసీఆర్ ప్రాజెక్టును రీడిజైన్ చేయించారు. కెపాసిటీని 8.23 టీఎంసీలకు పెంచారు. ఇందు కోసం మరో 3,870 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. భూసేకరణకు సంబంధించి దాదాపు పరిహారాలు ఇచ్చినా, కొందరికి ముంపు గ్రామాల్లోని ఇండ్ల స్ట్రక్చర్, ఖాళీ స్థలాలు, 18 ఏండ్లు నిండిన వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెండింగ్పెట్టారు. ఇతర ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇస్తున్న మొత్తాన్నే ఇక్కడ కూడా ఇవ్వాలని గుడాటిపల్లిలో వెయ్యి రోజులకు పైగా రిలే దీక్షలు నిర్వహించారు. తర్వాత కొందరు హైకోర్టును, మరికొందరు ఎన్జీటీని ఆశ్రయించారు.