హైడ్రాను స్వాగతించాల్సిందే..

హైడ్రాను స్వాగతించాల్సిందే..
  • మూసీ కంటే ముందు పీసీబీని ప్రక్షాళన చేయాలి 
  • ఎన్విరాన్​మెంట్​ సోషల్​ వర్కర్ పీఎల్ఎన్​రావు సూచన

ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రాను అందరూ స్వాగతించాల్సిందేనని ఎన్విరాన్​మెంట్​సోషల్ వర్కర్ పి.ఎల్.ఎన్.రావు చెప్పారు. శుక్రవారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. చెరువులు, కుంటలు ఆక్రమించి చేపట్టిన ఇండ్లు, ఇతర నిర్మాణాలను తొలగించడంలో తప్పు లేదన్నారు. ఇటీవల చెన్నై, ఇతర రాష్ట్రాల్లో వరదలకు కాలనీలు మునిగాయని, మనకు ఆ పరిస్థితి రాక ముందే మేల్కోవాలన్నారు. 

మూసీ ప్రక్షాళన కంటే ముందు పీసీబీ ప్రక్షాళనపై సీఎం రేవంత్​రెడ్డి దృష్టి పెట్టాలన్నారు. పటాన్​చెరు, జీడిమెట్ల పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయడం లేదన్నారు. నేరుగా నాలాల ద్వారా మూసీలోకి చేరుతున్నాయన్నారు.

మల్లాపూర్​ట్రీట్​మెంట్​ప్లాంట్​లో శుద్ధి చేయకుండా నాలా ద్వారా ఉప్పల్​ చెరువులోకి రిలీజ్​చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీల యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. న్యాయవాది కరణం రాజేశ్​కుమార్, బి.రాజారాంసింగ్, జాలా మల్లేశ్ యాదవ్, సీహెచ్​లింగారెడ్డి పాల్గొన్నారు.