- ఇందిరాపార్క్ వద్ద పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాల ధర్నా
- రాడార్ కేంద్రంతో చుట్టూ 100 కి.మీ. వరకూ రేడియేషన్ ఎఫెక్ట్
- ప్రజలతోపాటు వన్యప్రాణులకూ ముప్పు
- దామగుండం రక్షణకు మరో చిప్కో ఉద్యమం రావాలని వక్తల పిలుపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: వికారాబాద్ జిల్లా దామగుండం అడవిలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుతో పర్యావరణంతోపాటు మనుషులకు, జీవరాశులకూ పెనుముప్పు కలుగుతుందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిటీకి ఆక్సిజన్ సిలిండర్ లాంటి దామగుండం అడవిని నాశనం చెయ్యొద్దని కోరారు. దామగుండం అడవిలో 2,900 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న నేవీ రాడార్ సెంటర్ కు వ్యతిరేకంగా ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ‘సేవ్ దామగుండం’ పేరుతో ధర్నా నిర్వహించారు. సేవ్ దామగుండం జేఏసీ, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసీ చందు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాడార్ సెంటర్ తో చుట్టూ వంద కిలోమీటర్ల వరకూ రేడియేషన్ ప్రభావం ఉంటుందని, దానితో మనుషులతోపాటు వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందన్నారు. రాడార్ సెంటర్ ను మరో చోటుకు తరలించాలని డిమాండ్ చేశారు. దేశంలోనే భారీ స్థాయిలో అటవీ విధ్వంసం జరుగుతుంటే ప్రధాన పార్టీలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం12 లక్షల చెట్లు,16 వేల ఔషధ మొక్కలను నరకడం దుర్మార్గమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అడవితోపాటు 500 ఏండ్ల చరిత్ర ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆయలం కూడా రాడార్ సెంటర్ పరిధిలోకి వెళ్తుందన్నారు. సేవ్ నల్లమల, చిప్కో తరహాలో ఉద్యమం చేపట్టి దామగుండం అడవిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రకృతి ఏ ఒక్కరి సొత్తు కాదు
ప్రకృతి, రాజ్యాంగం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ ఉద్యమంలో అందరినీ భాగస్వాము లను చేయాలి. సద్దులు కట్టుకొని వచ్చి పోరాడాలి. దామగుండం అటవీ విధ్వంసం భవిష్యత్ తరాల సమస్య. 18 ఏండ్లలోపు పిల్లలందరిలో ప్రకృతిని కాపాడుకోవాలన్న అవగాహన పెంచాలి. 1956లో తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రం కలిశాక ప్రకృతి విధ్వంసం మొదలైంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అది మరింత ఎక్కువైపో యింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే యజ మానులు. అధికారంలో ఉన్న వారంతా సేవకులు. ప్రజలు చెప్పిన ప్రకారమే వాళ్లంతా నడుచుకోవాలి. దుశర్ల సత్యనారాయణ, పర్యావరణవేత్త
ఈసీ, మూసీలు ప్రళయం ఎత్తాలి
దామగుండం సమస్య ఇప్పటిది కాదు. ఈసీ, మూసీ నదులు అక్కా చెల్లెళ్ళు ఉయ్యాల అంటూ 2012కు ముందే పాట రాశాను. రాడార్ సెంటర్ ను ఆపాలంటే ఈసీ, మూసీ నదులు మరోసారి ప్రళయం ఎత్తాలి.
- విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య
త్వరలో ‘దామగుండాన్ని హత్తుకుందాం’
అడవిని డిస్టర్బ్ చేయకుండా రాడార్ సెంటర్ ఏర్పాటు చేయొచ్చు. కానీ, ఇక్కడ లక్షలాది చెట్లు పోతున్నాయి.
300 చెట్ల కోసం చిప్కో ఉద్యమం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉద్యమాలు రావాలి? త్వరలో ‘దామగుండన్ని హత్తుకుందాం’ కార్యక్రమాన్ని చేపడదాం. తులసీ చందు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్
రాడార్ కేంద్రానికి మరో చోటే లేదా?
ప్రజలు పోరాడుతుంటే మౌనంగా ఉండటం కూడా నేరమే. వారి గొంతులకు, మన గొంతులను అందించాలి. నేవీ రాడార్ సెంటర్ ను వ్యతిరేకిస్తే దేశద్రోహం కాదు. పర్యావరణాన్ని, అభివృద్ధిని బ్యాలన్స్ చేయాలి. లక్షల చెట్లను నరికి, ప్రత్యామ్నాయంగా మరో చోట చెట్లను నాటుతాం అంటున్నారు. దేశంలో నేవీ రాడార్ సెంటర్ పెట్టడానికి మరో ప్రదేశమే లేదా?
- ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ
నాలుగైదు రోజుల్లో కార్యాచరణ
దామగుండం అడవిపై రచయిత మిత్ర రాసిన ‘దామగుండం నువు చల్లగుండాల’ పాటను అరుణోదయ విమలక్క పాడగా, కార్యక్రమానికి వచ్చినవారు భావోద్వేగానికి గురయ్యారు. మరో నాలుగైదు రోజుల్లో దామగుండంపై తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని జేఏసీ ప్రకటించింది. కార్యక్రమంలో రామలింగేశ్వర ఆలయ పూజారి సత్యానంద స్వామి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, పీవోడబ్ల్యూ లీడర్ సంధ్య, అరుణోదయ విమలక్క, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.