తొలి సోలార్​ వెలుగుల ఆలయంగా భద్రాద్రి

  •     ప్రారంభించిన ఈవో రమాదేవి
  •     సన్​ టెక్నాలజీస్​ తో 25 ఏండ్ల ఒప్పందం

భద్రాచలం, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో తొలి సోలార్​ వెలుగుల దేవాలయంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం రికార్డులకెక్కింది. సన్​ టెక్నాలజీస్​ ప్రైవేట్​లిమిటెడ్​ సంస్థతో 25 ఏండ్ల ఒప్పందంతో రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ పూర్తి కావడంతో శుక్రవారంఈవో రమాదేవి పూజలు చేసి ప్రారంభించారు. తర్వాత ప్రాజెక్ట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోలార్​ప్రాజెక్టుతో రామాలయంతో పాటు, కాటేజీలు, గదులకు విద్యుత్​ సరఫరా చేయవచ్చన్నారు.

యూనిట్​కు రూ.5.20 లను సన్​టెక్నాలజీస్​కు చెల్లిస్తామని, దీని వల్ల నెలకు సుమారు రూ.1.50 లక్షల వరకు విద్యుత్​బిల్లు ఆదా అవుతుందన్నారు. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు మొత్తం ఒప్పందం ప్రకారం సంస్థనే భరిస్తుందని వివరించారు. ఏఈవో శ్రావణ్​కుమార్​, ఈఈ రవీందర్​, సన్​ టెక్నాలజీస్​ ఇంజనీర్​ వెంకట్​పాల్గొన్నారు.