
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్..పీఎఫ్ డ్రా చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా..ఎన్నిసార్లు ఆన్లైన్లో క్లెయిమ్ చేసినా విత్ డ్రా సమస్యలు వస్తున్నాయా..ఇకపై అలాంటి సమస్యలు ఉం డవు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్ ప్రణాళికలు సిద్దం చేసింది. ఇకపై నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ సౌకర్యం మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానుంది. యూపీఐ ద్వారా, అదేవిధంగా ఏటీఎం ద్వారా ఖాతాదారులు పీఎఫ్ ను విత్ డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుత సిస్టమ్ ద్వారా పదేపదే క్లెయిమ్ రిజెక్ట్ సమస్యలతో పీఎఫ్ ఖాతాదారులు ఇబ్బందుపడుతున్నారు. 2024 EPF యాన్యువల్ రిపోర్టు ప్రకారం.. ప్రతి మూడు క్లెయిమ్ లకు ఒకటి రిజెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పీఎఫ్ విత్ డ్రా సమస్యలకు చెక్ పెట్టేందుకు, వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మే లేదా జూన్ 2025లో యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రాలను ప్రారంభించనుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్. దీని ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు GPay, Phonepe, Paytm వంటి డిజిటల్ ప్లాట్ ఫాంల ద్వారా తమ సేవింగ్స్ ను తక్షణమే విత్ డ్రా చేసుకోవచ్చు. ఇదే విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( NPCI) తో EPFO చర్చలు జరుపుతోంది.
మరోవైపు ATM విత్ డ్రాలపై కూడా చర్చలు జరుపుతోంది. EPFO 3.0లో భాగంగా ATM ద్వారా విత్ డ్రాలను 2025 జూన్ నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూఖ్ మాండవియా చెప్పారు.
UPI ద్వారా EPF విత్ డ్రాలతో ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. ప్రస్తుత EPF విత్ డ్రా ప్రక్రియ ద్వారా 23 రోజులు పడుతుంది. UPI ద్వారా EPF విత్ డ్రా అమలు జరిగితే పీఎఫ్ విత్ డ్రా నిమిషాల్లో జరుగుతుంది. కొత్త విధానంలో పారదర్శకత, నిరంతరాయంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. దీంతో పాటు EFPO 3.0 రోల్-అవుట్ ద్వారా ఖాతాదారులు తమ సేవింగ్స్ ను సాధారణ బ్యాంక్ ఖాతా వలె విత్ డ్రా చేసుకోవచ్చు.