పీఎఫ్​ వడ్డీ మారలే!..ఈసారీ 8.25 శాతమే

పీఎఫ్​ వడ్డీ మారలే!..ఈసారీ 8.25 శాతమే

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ​ప్రావిడెంట్​ ఫండ్​ ఆర్గనైజేషన్​(ఈపీఎఫ్​ఓ) 2024–25 సంవత్సరంలో తన సభ్యులకు ఇచ్చే వడ్డీని మార్చలేదు. ఈసారి కూడా 8.25 శాతమే ఇస్తామని ప్రకటించింది. ఈ సంస్థకు ఏడు కోట్ల మంది చందాదారులు ఉన్నారు. 2023–24లో వడ్డీ రేటు 8.15 శాతం ఉండగా, గత ఫిబ్రవరిలో దీనిని 8.25 శాతానికి పెంచింది. 

ఈసారి కూడా 8.25 శాతం వడ్డీ ఇవ్వాలని సంస్థ ట్రస్టీల సెంట్రల్​ బోర్డు సిఫార్సు చేసింది. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్​ రానుంది. ఈపీఎఫ్ ​డిపాజిట్లపై సంపాదించిన మొత్తంపై (కొంత పరిమితి వరకు) ట్యాక్స్ ఉండదు కాబట్టి ఇది ఆకర్షణీయమైన పెట్టుబడిగా మారింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ నాయకత్వంలోని సీబీటీ...ఎంప్లాయీస్​ డిపాజిట్​ లింక్డ్‌‌​ ఇన్సూరెన్స్​(ఈడీఎల్​ఐ) స్కీము కింద ఇస్తున్న ఆరోగ్యపరమైన ప్రయోజనాలను పెంచాలని నిర్ణయించింది. 

ఏడాది సర్వీసు పూర్తికాకుండానే చందాదారుడు మరణిస్తే రూ.50 వేలు పరిహారం చెల్లిస్తారు. ప్రస్తుతం ఏదైనా కారణాల వల్ల పీఎఫ్​ కట్టని రోజులు నెల కన్నా ఎక్కువ ఉంటే ఈ స్కీమ్​ వర్తించదు. ఇప్పటినుంచి చివరి చందా చెల్లించిన ఆరు నెలల్లో ఉద్యోగి మరణించినా ఈ పథకం వర్తిస్తుంది. 

చందాదారుడు ఒక కంపెనీ నుంచి మరోదానికి మారినప్పుడు ఈపీఎఫ్​ సర్వీసుకు ఒక్క రోజు అంతరాయం కలిగినా ఈడీఎల్‌‌ఐ స్కీము నుంచి బయటికి వచ్చినట్టుగా పరిగణిస్తున్నారు. ఇకనుంచి రెండు నెలల గడువు ఉన్నా సర్వీసులో కొనసాగినట్టే భావిస్తారు.