మహమ్మారి గండం మరో నెల.. మేలో పీక్​ స్టేజ్​కి కరోనా

మహమ్మారి గండం మరో నెల.. మేలో పీక్​ స్టేజ్​కి కరోనా
  • మేలో పీక్​ స్టేజ్​కి.. ఆ తర్వాత తగ్గుముఖం
  • మొదటి రెండు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలె
  • కొద్దిరోజులు కేసులు ఎక్కువగా నమోదైతయ్​
  • రోజురోజుకు కోలుకునేవారి సంఖ్య కూడా పెరుగుతది
  • జనం సహకరిస్తే మే నెలాఖరులో పరిస్థితి అదుపులోకి వస్తది
  • సోషల్ డిస్టెన్స్, మాస్క్​ ద్వారానే వైరస్ కట్టడి
  • హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌, ఎన్‌‌ఐఎన్‌‌, సీసీఎంబీ అంచనాలివి


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా తీవ్రత మరో నెల రోజులు ఉంటుందని, ఆ తర్వాత మెల్లగా అదుపులోకి వస్తుందని హెల్త్ డిపార్ట్​మెంట్ అంచనా వేసింది. వైరస్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఫస్ట్ వేవ్ తరహాలోనే కొద్దిరోజులు కేసుల సంఖ్య పెరుగుతుందని, అయితే రోజురోజుకు కోలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్​పై దేశవ్యాప్తంగా పలు రీసెర్చ్ సెంటర్లు తమ స్టడీ రిపోర్టులను వెల్లడించాయి. ఆ ప్రకారం.. మే 13 నుంచి 16వ తేదీ మధ్యలో కేసుల సంఖ్య పెరిగే చాన్స్ ఉందని ఇన్‌‌ఫెక్షియస్ డిసీజ్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌‌ బుర్రి రంగారెడ్డి  తెలిపారు. దేశవ్యాప్తంగా మే 3వ వారం వరకు కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.

ఒకరి నుంచి ముగ్గురికి..
సెకండ్ వేవ్​లో కరోనా సోకిన వారి నుంచి సగటున మరో ముగ్గురికి వ్యాప్తి అవుతుందని, అందుకే స్పీడ్ ఎక్కువగా కనిపిస్తోందని ఎపిడమిక్ సెల్ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. తెలంగాణలో రెండు వారాల్లోనే కేసుల సంఖ్య మూడు రెట్లు దాటింది. ప్రస్తుతం రోజుకు 5 వేల నుంచి 6 వేల కేసులు నమోదవుతున్నాయి. నిరుడు ఫస్ట్ వేవ్​లో అత్యధికంగా ఆగస్టు 25న 3,018 కేసులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి కేసుల సంఖ్య పెరగటంతోపాటు స్పీడ్​గా వ్యాపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో పీక్ స్టేజ్ కొనసాగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే రోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇంత స్పీడ్ ఉంటుందని అంచనా లేకపోవటం, ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయకపోవటంతో బెడ్లు, ఆక్సిజన్‌‌, మెడిసిన్ దొరక్క పేషెంట్లు అరిగోస పడుతున్నారు. మరో 2 నుంచి 3 వారాల్లో ఈ పరిస్థితి కుదుట పడుతుందని స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అంచనాతో ఉంది. ఇప్పటికే రాష్ర్టంలో కొన్ని ఏరియాల్లో పాజిటివ్ రేట్ తగ్గిందని, కానీ రాష్ర్టవ్యాప్తంగా కంట్రోల్‌లోకి రావడానికి మరింత టైమ్ పడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.

360 టన్నుల ఆక్సిజన్ కావాలె
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో కలిపి 17 వేల మందికిపైగా ఇన్‌పేషెంట్లు ఉన్నారు. వీరిలో 14,200 మంది ఆక్సిజన్‌, వెంటిలేటర్‌‌పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ వినియోగిస్తుండగా, కేసుల తీవ్రతను బట్టి రోజుకు 360 టన్నుల ఆక్సిజన్ అవసరం పడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని అంటున్నారు. ఫస్ట్ వేవ్​లో హోం ఐసోలేషన్​లో ఉండే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందని, సాధారణ లక్షణాలతోనే ఎక్కువ మంది కోలుకున్నారని హెల్త్ డిపార్టుమెంట్​బులెటిన్లు వెల్లడించాయి. ఈసారి కరోనా సోకిన వారిలో ఎక్కువ మందికి ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్లు అవసరం పడ్డాయని.. దీంతో రెండు వారాల్లోనే హాస్పిటళ్లలో 70 నుంచి 80 శాతం బెడ్లు నిండిపోయాయని డాక్టర్లు చెబుతున్నారు.

మే 3వ వారంలో పీక్​: ఎస్​బీఐ రిపోర్ట్
దేశంలో మే 3వ వారంలో కరోనా పీక్ స్టేజ్​లోకి వెళ్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్టులో వెల్లడించింది. ‘‘ఫస్ట్ వేవ్ సమయంలో యూపీ, మహారాష్ట్రలో ముందే పీక్ స్టేజ్ వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో కేసులు స్టెబిలైజ్ అవుతున్నాయి. ఈ సెకండ్ వేవ్​లో ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. కఠిన ఆంక్షలను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తే.. మహారాష్ట్రలో పీక్‌‌ తర్వాత దేశంలో పీక్ స్టేజ్ రెండు వారాల్లోనే వచ్చే అవకాశం ఉంది” అని వివరించింది. ఫిబ్రవ‌‌రి- 15 నుంచి పీక్ టైమ్‌‌ను 96 రోజులుగా అంచ‌‌నా వేసిన‌‌ట్లు ఎస్బీఐ చీఫ్ ఎక‌‌నామిక్ అడ్వైజ‌‌ర్ డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. ఆ లెక్కన మే మూడో వారంలో సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌‌కు చేరనుందని చెప్పారు.

ఫస్ట్ వీక్ టఫ్
దేశమంతటా మే మొదటి వారంలో కరోనా పీక్ స్టేజ్​లోకి వెళ్తుందని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌‌(ఎన్‌‌ఐఎన్‌‌) సీనియర్ సైంటిస్ట్, పబ్లిక్ హెల్త్ ఎపిడమాలజిస్ట్‌‌ లక్ష్మయ్య తెలిపారు. ఆ తర్వాత మెల్లగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చని చెప్పారు. సీసీఎంబీ డైరెక్టర్‌‌‌‌ రాకేశ్ మిశ్రా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వైరస్ స్పీడ్, ట్రెండ్  ప్రకారం చూస్తే.. మే మొదటి రెండు వారాలు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ డిస్టెన్స్​తో పాటు మాస్క్​ద్వారానే వైరస్ కట్టడి చేసే వీలుందని అన్నారు. జనాల్లో కరోనా పట్ల భయం పెరిగిందని, జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ఇలాగే కంటిన్యూ చేస్తే మే నెలాఖరులో వైరస్ కంట్రోల్‌‌లోకి వచ్చే చాన్స్ ఉందని లక్ష్మయ్య అన్నారు.

ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లు పెంచుతున్నం
ఇంకో నెల రోజులు గడ్డు కాలం. మా అంచనా ప్రకారం మరో రెండు వారాలు కేసుల సంఖ్య ఇలాగే కొనసాగుతుంది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టే చాన్స్ ఉంది. ప్రజలు సహకరిస్తే మే నెలాఖరులో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుంది. అందుకు తగ్గట్టుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇంకో 15 నుంచి 20 శాతం ఆక్సిజన్, ఐసీయూ బెడ్లను పెంచుతున్నాం. ఆక్సిజన్, మెడిసిన్ అన్నీ అంచనాకు తగ్గట్టు ప్రభుత్వం సమకూరుస్తోంది. ఒక వారం రోజుల నుంచి మెజారిటీ ప్రజలు కరోనా రూల్స్ పాటిస్తున్నారు. పరిస్థితులు చక్కబడేదాకా ఇలాగే ఉండాలని కోరుతున్నం.
- శ్రీనివాసరావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌