చదువు కోసం పాట సాయం

తెలంగాణలో 15.45 శాతం ఉన్న దళితుల  అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. వందేళ్ల కిందటే తెలంగాణలో దళితులకు చదువు అవసరాన్ని గుర్తించినప్పటికీ అది నూటికి నూరు శాతం అమలు కాలేదు. తెలంగాణలో ఉన్నతాధికారులుగా ఎదిగిన దళితులను వేళ్ల మీద లెక్కించవచ్చు. దీనికి ప్రధాన కారణం చదువు అవసరాన్ని సరిగా గుర్తించకపోవడమే.

దళితుల వెనకబాటు

మహాత్మా జ్యోతిరావు పూలే – సావిత్రిబాయి జీవిత కాలం కృషి అంతా జ్ఞానం చుట్టూనే తిరిగింది. దళిత వాడలు బాగుపడాలంటే చదువే అసలైన ఆయుధమని వాళ్లు గుర్తించారు. దళితులకు చదువు అందేలా చేయడానికి సత్యశోధక్ సమాజ్​ను స్థాపించడంతో పాటు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇట్లా సాగిన అక్షర చైతన్య యాత్ర ఇంపార్టెన్స్ ను బాబా సాహెబ్ అంబేద్కర్ గుర్తించారు. అక్షరాల బాటను అందిపుచ్చుకుని ప్రపంచ జ్ఞానాన్ని ఔపోసన పట్టాడు.  జ్ఞానవంతులకు సమాజం సలాం కొట్టక తప్పదని నిరూపించాడు. ఇలాంటి నేపథ్యమున్న జ్ఞాన సమాజ ఆవశ్యకత తెలంగాణకు అంది రాలేదు.తెలంగాణలో  దళితులకు చదువు అవసరం తెలియకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. తరతరాలుగా ఇక్కడ వారసత్వంగా వచ్చిన వెట్టిచాకిరి.. దళితులను చదువులకు దూరం చేసింది. ఉద్యమాలు కూడా దళితులను ముందుకు నడపలేకపోయాయి. దళితులను కేవలం కార్యకర్తలుగానే చూశారు. ఈ క్రమంలో వేలాది మంది దళితులు చదువులకు దూరమై పార్టీల జెండాలు మోయడంలోనే జీవితాలు వెళ్లదీశారు. దాదాపుగా మూడు తరాల దళితులు ఇలా చదువులకు దూరమయ్యారు.  ప్రపంచమంతా  అభివృద్దిలో దూసుకుపోతుంటే, తెలంగాణ దళితులు మాత్రం ఏ పూట భోజనం ఆ పూట దేవులాడుకుంటున్నారు.

ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం చదువే. దళితుల్లో చదువుపై అవగాహన పెంచే కార్యక్రమాన్ని పాటతో  మొదలుపెడుతున్నాడు ఏపూరి సోమన్న.

బక్కోనితో బందూకులు పట్టించింది

తెలంగాణలో ఇప్పటివరకు పాట పోషించిన పాత్ర అద్వితీయమైంది. పాట అనేక ఉద్యమాలకు ఊపిరిపోసింది. బాంచనన్న బక్కోని తో బందూకులు పట్టించింది. సొంత రాష్ట్రాన్ని  సాధించుకోవడంలో కీలకంగా మారింది. అలా ఉద్యమపాట సామాన్య ప్రజానీకంపై  తీవ్ర ప్రభావాన్ని చూపింది. అంత పవర్ ఫుల్ పాట చదువుకోసమైతే, ఫలితాలు ఎలా ఉంటాయి ? తెలంగాణ వ్యాప్తంగా లక్షలాదిమంది  ప్రజానీకాన్ని కలవడానికి, దళితుల బతుకులు మారాలంటే దానికి చదువే మార్గమని ఊరారా చాటింపు వేయడానికి వస్తున్నాడు ఏపూరి సోమన్న. తెలంగాణ రాష్ట్ర సాధనలో “ పోరు సాగుతోంది కొడుకా – తెలంగాణ హోరు సాగుతోంది బిడ్డా ”అని పల్లెపల్లెన పాటై ప్రవహించిన చరిత్ర  ఏపూరి సోమన్నది. తెలంగాణ పునర్నిర్మాణంలో  ప్రజా ఉద్యమ పంథాను కొనసాగిస్తున్న పదునైన కలం సోమన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత పలుకుతున్న అతి కొద్ది కలాల్లో సోమన్న ఒకరు. పూలే – అంబేద్కర్ భావజాలంతో  ప్రజలను ఆలోచింపచేసే పాటలు రాసి పాడుతూ సాగిపోతున్నాడు. చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్రను తిరగరాయాలని చాటింపు వేస్తున్నాడు. ‘‘గొర్లను, బర్లను కాసే పోరలే ఇంజనీర్లు కావాలే, విమానమెక్కాలే ”అని ఒక దిశానిర్దేశం చేస్తున్నాడు. దళితుల్లో చదువుపై అవగాహన పెంచడానికి జ్ఞాన చైతన్య యాత్రకు సిద్ధమయ్యాడు.

జీనా హై తో పడ్ నా సీకో

దళితులకు ఇవాళ కావలసింది చదువు ఉద్యమం. అక్షరాలు మాత్రమే  ఆత్మ గౌరవాన్ని అందిస్తాయన్న సోయి  కలగాలి. అందుకోసం దళితులను కలవాలి. కదిలించాలి. “జీనా హై తో పడ్ నా సీకో ” ఇదీ ఇవాళ్టి నినాదం. చదువుకుని అన్ని రంగాల్లో దూసుకుపోయినప్పుడే దళితులకు బాధల నుంచి విముక్తి లభిస్తుంది. “ఆకలి తీరడం మాత్రమే మన సమస్య కాదు. ఆత్మ గౌరవంతో తలెత్తుకు జీవించడం ముఖ్యం ’’ అన్నాడు డాక్టర్ అంబేద్కర్. ఆ మహనీయుని జీవితంలోని వ్యక్తిగత క్రమశిక్షణతో దళితులు ఇవాళ స్ఫూర్తిని  పొందాలి.లేదంటే రానున్న తరాలు క్షమించవు.   – డాక్టర్ పసునూరి రవీందర్ , (‘ ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర ’ ప్రారంభం సందర్భంగా)

epuri somanna ready for Jnana Chaitanya Yatra to raise awareness on education for Dalits