ముంబై : ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం కొత్త మైలురాయిని చేరుకున్నాయి. బెంచ్‌మార్క్ సెన్సెక్స్ మొదటిసారి చారిత్రాత్మక 84,000-మార్క్‌ను అధిగమించగా, నిఫ్టీ శుక్రవారం కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. యూఎస్, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పాటు బ్యాంక్ షేర్లకు గిరాకీ కారణంగా సూచీలు దూసుకెళ్లాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 1,359.51 పాయింట్లు జంప్ చేసి 84,544.31 దగ్గర ఆల్ టైమ్ హైకి చేరింది. ఇంట్రాడేలో 1,509.66 పాయింట్లు పెరిగి ఇంట్రా-డే గరిష్ట స్థాయి 84,694.46ను తాకింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 375.15 పాయింట్లు పెరిగి రికార్డు స్థాయిలో 25,790.95 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 433.45 పాయింట్లు జూమ్ చేసి ఆల్-టైమ్ ఇంట్రా-డే గరిష్ట స్థాయి 25,849.25కి చేరుకుంది. 30 సెన్సెక్స్ సంస్థల్లో మహీంద్రా అండ్ మహీంద్రా 5 శాతానికి పైగా ఎగసింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6.24 లక్షల కోట్లు పెరిగింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, భారతీ ఎయిర్టెల్, నెస్లే, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్ లాభపడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్ వెనకబడి ఉన్నాయి. ఫెడ్వడ్డీ రేట్లను తగ్గించడంతో భారతీయ మార్కెట్లలో జోష్ కనిపించిందని, గ్లోబల్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
అన్ని ఇండెక్స్లూ లాభాల్లోనే..
రియల్టీ, ఆటో, మెటల్ స్టాక్‌లు లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 1.37 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.16 శాతం పెరిగింది. రియల్టీ 3.21 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.32 శాతం, ఆటో 2.12 శాతం, పారిశ్రామిక 2.08 శాతం, మెటల్ 1.82 శాతం, వినియోగదారుల విచక్షణ 1.78 శాతం, ఆర్థిక సేవలు 1.55 శాతం , బ్యాంకెక్స్ 1.44 శాతం, హెల్త్‌కేర్ 1.10 శాతం పెరిగింది. బీఎస్ఈలో మొత్తం 2,442 కంపెనీల షేర్లు లాభపడగా, 1,502 నష్టపోయాయి. ఈవారంలో సెన్సెక్స్ 1,653.37 పాయింట్లు లేదా 1.99 శాతం పెరిగింది. నిఫ్టీ 434.45 పాయింట్లు లేదా 1.71 శాతం పెరిగింది.
గత గురువారం, 30 షేర్ల బీఎస్ఈ బెంచ్‌మార్క్ మొదటిసారిగా 83,000 స్థాయిని తాకింది. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభాలు సంపాదించాయి. యూరప్ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు అసాధారణ లాభాలతో ముగిశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) గురువారం రూ. 2,547.53 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.23 శాతం తగ్గి 74.71 డాలర్లకు చేరుకుంది.