న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలోకి పెట్టుబడులు తగ్గాయి. కిందటి నెలలో నికరంగా రూ.34,419 కోట్లు వీటిలోకి వచ్చాయి. అంతకు ముందు నెలతో పోలిస్తే 10 శాతం పడిపోయాయి. ముఖ్యంగా థీమ్ రిలేటెడ్, లార్జ్ క్యాప్ ఫండ్స్ స్కీమ్‌లలోకి పెట్టుబడులు తగ్గాయి. ఈ ఏడాది ఏప్రిల్ ( రూ.18,917 కోట్ల ఇన్‌ఫ్లోస్) తర్వాత ఈ నెలలోనే ఈక్విటీ స్కీమ్స్‌లోకి తక్కువ పెట్టుబడులు వచ్చాయి.
ఇన్వెస్ట్‌మెంట్స్ తగ్గినప్పటికీ వరుసగా 43 నెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఆకర్షించగలిగాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) డేటా ప్రకారం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూట్‌లో సెప్టెంబర్‌లో రికార్డ్ లెవెల్లో రూ.24,509 కోట్లు మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చాయి.
క్రమశిక్షణతో లాంగ్‌టెర్మ్‌లో సంపద పెంచుకోవడం బెటర్ అనే ఆలోచన ఇన్వెస్టర్లలో పెరుగుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. మొత్తంగా కిందటి నెలలో మ్యూచువల్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.71,114 కోట్లు విత్‌డ్రా అయ్యాయి. డెట్ స్కీమ్‌ల నుంచి రూ.1.14 లక్షల కోట్లు విత్‌డ్రా అవ్వడమే కారణం.