న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) స్కీమ్స్‌లోకి జూన్ క్వార్టర్‌లో ఏకంగా రూ.94,151 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రూ.18,358 కోట్లతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండడం, షేర్లు మంచి లాభాలిస్తుండడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీగా డబ్బులు పెడుతున్నారు.
దీంతో మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ మేనేజ్ చేస్తున్న మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) ఏడాది ప్రాతిపదికన 59 శాతం పెరిగి రూ.17.43 లక్షల కోట్ల నుంచి రూ.27.68 లక్షల కోట్లకు ఎగిసింది. మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లు 13.3 కోట్లకు పెరిగాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫి) డేటా ప్రకారం, ఈక్విటీ ఫండ్స్ స్కీమ్‌లలోకి ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో రూ.94,151 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.18,917 కోట్లు, మే నెలలో 34,697 కోట్లు, జూన్ నెలలో రూ.40,537 కోట్లు వచ్చాయి. మరోవైపు నెల వారి ఇన్వెస్టర్లు చేస్తున్న సిప్ కంట్రిబ్యూషన్ జూన్‌లో రూ.21,262 కోట్లకు చేరుకొని ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసింది. క్యూ1 లో సిప్ రూట్‌లో రూ.62,537 కోట్లు వచ్చాయి.