హైదరాబాద్: తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపుపై నెలకొన్న ఉత్కంఠకు ఈఆర్సీ తెరదించింది. విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదలను ఈఆర్సీ తిరస్కరించింది. ఏ కేటగిరిలోనూ విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ స్పష్టం చేసింది. డిస్కంలు దాఖలు చేసిన మొత్తం 8 పిటిషన్లపై 2024, అక్టోబర్ 28న ఈఆర్సీ తన అభిప్రాయాలు వెల్లడించింది. ఈ సందర్భంగా ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు మీడియాతో మాట్లాడుతూ.. స్థిర ఛార్జీలు రూ.10 యథాతథంగా ఉంటాయన్నారు.
అన్ని పిటిషన్లపై ఎలాంటి లాప్స్ లేకుండా నిర్ణయం వెల్లడించాలని ఈఆర్సీ నిర్ణయించిందని తెలిపారు. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరించామన్నారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎనర్జీ ఛార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదన్నారు. స్థిర ఛార్జీలు రూ.10 యథాతథంగా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.
గృహ వినియోగదారులకు మినిమం ఛార్జీలు తొలగించామని చెప్పారు. పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేదని.. హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశామని తెలిపారు.132kva, 133kva, 11kv లలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయని పేర్కొన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్‌కు కమిషన్ ఆమోదించిందని.. అయితే, టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ ఆవర్‌లో రూపాయి నుంచి 1:50 రాయితీ పెంచామన్నారు. చేనేత కార్మికులకు హర్స్ పవర్‌ను పెంచామని.. హార్స్ పవర్ 10 నుంచి హెచ్‌పీ 25కి పెంచామని వెల్లడించారు. గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు కమిషన్ ఆమోదించిందని తెలిపారు. రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిందని వెల్లడించారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే.. ఈఆర్సీ రూ. 54,183.28 కోట్లు ఆమోదించిందని తెలిపారు.