- పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం
- బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
- దేవరకద్రలో గుర్రుగా ఉన్న అసమ్మతి లీడర్లు
- క్యాడర్‌ను తమ వైపు మళ్లించుకుంటున్న అపోజిషన్ పార్టీలు
మహబూబ్‌నగర్, వెలుగు : కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి లీడర్లు రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హైకమాండ్ టికెట్లు నిరాకరించడంతో రాజీనామా చేస్తున్నారు. తాజాగా నాగర్‌కర్నూల్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జడ్చర్ల టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఏకంగా పార్టీ మారడం హాట్ టాపిక్‌గా మారింది. దేవరకద్రకు చెందిన అసమ్మతి లీడర్లు సోమవారం పాలమూరులో ప్రెస్‌మీట్ పెడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ లిస్ట్‌పై గుర్రు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు, కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15న రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్టులో 8 సెగ్మెంట్లకు, మూడు రోజుల కింద రిలీజ్ చేసిన సెకండ్ లిస్టులో పెండింగ్‌లో ఉన్న ఆరు స్థానాలకు క్యాండిడేట్లను ఫైనల్ చేసింది. క్యాండిడేట్లను ఫైనల్ చేసినప్పటి నుంచి అసంతృప్తులు నిరసనలకు దిగుతున్నారు. తమకు కాకుండా ఇతరులకు టికెట్లు ఎలా ఇస్తారంటూ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ టికెట్ తనకే వస్తుందని ముందు నుంచి ప్రచారం చేసుకున్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి.. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఫస్ట్ లిస్టులోనే ఈ సెగ్మెంట్ నుంచి యువ లీడర్ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డికి హైకమాండ్ టికెట్ కన్ఫాం చేసింది. అప్పటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న తనకే టికెట్ కేటాయించాలంటూ నాగం డిమాండ్ చేస్తున్నారు.
సెకండ్ లిస్టులోనైనా మార్పు ఉంటుందని ఆశించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ మంత్రులు జానారెడ్డి, జిల్లెల చిన్నారెడ్డి బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి వనపర్తి టికెట్ ఆశించారు. సెకండ్ లిస్ట్‌లో చిన్నారెడ్డి పేరు ఖరారు కావడంతో ఆయన వర్గం లీడర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారెడ్డి పోటీ నుంచి తప్పుకొని మేఘారెడ్డికి టికెట్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
లేనిపక్షంలో ఇండిపెండెంట్‌గా పోటీలో ఉంటామనే ప్రకటనలు చేస్తున్నారు. ఆదివారం మేఘారెడ్డి వర్గం లీడర్లు వనపర్తిలో బల ప్రదర్శన చేశారు. అనంతరం మేఘారెడ్డి తన అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై సమావేశమయ్యారు. ఇదే స్థానం కోసం ప్రయత్నం చేసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివాసేనారెడ్డి నిరసన తెలిపగా, హైకమాండ్ ఆయనతో చర్చలు జరుపడంతో సమస్య సద్దుమణిగింది.
ALSO READ : బీజేపీలో ఆ రెండు స్థానాలపై సస్పెన్స్
దేవరకద్రలోనూ అదే పరిస్థితి..
దేవరకద్ర టికెట్ కోసం ప్రదీప్‌కుమార్‌గౌడ్ కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సెకండ్ లిస్టులో పాలమూరు డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డి(జీఎంఆర్)కు హైకమాండ్ టికెట్ కన్ఫాం చేయడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. ఆదివారం జీఎంఆర్ దేవరకద్రలో ఉన్న ప్రదీప్, ప్రశాంత్‌రెడ్డి ఇండ్లకు వెళ్లి కలిసే ప్రయత్నం చేశారు. కానీ వారు కలువలేదని తెలిసింది. ప్రదీప్ మహబూబ్‌నగర్‌లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సోమవారం ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జడ్చర్లలో సీన్ రివర్స్..
జడ్చర్ల కాంగ్రెస్ టికెట్ కోసం జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ, వీరిద్దరి మధ్య హైకమాండ్ రాజీ కుదిర్చినట్లు కొద్ది రోజుల కింద వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా జడ్చర్ల నుంచి అనిరుధ్, నారాయణపేట నుంచి బీసీ ఈక్వేషన్స్‌లో ఎర్ర శేఖర్‌కు హైకమాండ్ టికెట్ కేటాయిస్తుందనే చర్చ జరిగింది. కానీ, ఎర్ర శేఖర్‌కు ఏ టికెట్ కేటాయించలేదు. అసంతృప్తితో ఉన్న ఆయన వర్గం లీడర్లు జడ్చర్ల నుంచి పోటీ చేయాలని ఎర్ర శేఖర్‌పై ఒత్తిడి తెస్తున్నారు.
కానీ, ఆయన అనూహ్యంగా ఆదివారం నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నారాయణపేటలో ఎస్ఆర్ రెడ్డికి సపోర్ట్ చేయాలనే ఈక్వేషన్‌తోనే శేఖర్‌ను పార్టీలో చేర్చుకున్నట్లు తెలిసింది. ఈ చేరికలో జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి లేకపోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది.
‘చే’జారుతున్న క్యాడర్..
నియోజకవర్గాల్లో లీడర్లు టికెట్ల కోసం కొట్లాటకు దిగుతుంటే.. గ్రామాలు, మండలాల్లో క్యాడర్ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఎలక్షన్‌కు నెల రోజుల ముందు అసమ్మతి రాజుకోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కాంగ్రెస్ క్యాడర్‌ను అపోజిషన్ లీడర్లు తమ పార్టీల్లో చేర్చుకున్నారు. ప్రధానంగా ఓటు బ్యాంకు ఉన్న లీడర్లనే టార్గెట్ చేస్తూ.. వారికి పలు రకాల హామీలు ఇచ్చి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.