- జీహెచ్ఎంసీ ఎలక్షన్ లా ఇక్కడ రిజల్ట్ ఉండదు
- కేర్లెస్గా ఉన్నందుకే దుబ్బాకలో ఓడినం: ఎర్రబెల్లి
వరంగల్ రూరల్, వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో నూటికి నూరు శాతం మంది వరద బాధితులకు సాయం అందించామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆరు నెలల కిందట వరంగల్ సిటీలో వానలతో వరదలు ముంచెత్తినయి. వరద బారిన పడిన దాదాపు 4 వేల మంది బాధితులకు రూ.1600–1800 చొప్పున అందించాం. వరద బాధితులు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. సిటీలో వరదల ఎఫెక్ట్ తక్కువగా ఉండటంతో సర్వే ఆధారంగా వరద సాయం పంపిణీ చేశాం” అని ఎర్రబెల్లి తెలిపారు. వరంగల్ ఓటర్లు తెలివున్నోళ్లని.. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో జనాలు ఇచ్చిన రిజల్ట్ లెక్క గ్రేటర్ వరంగల్ లో రిజల్ట్ ఉండబోదని ఎర్రబెల్లి కామెంట్ చేశారు. పబ్లిక్ బీజేపీ చెప్పే మాటలు వినరని అన్నారు.
డబ్బాలు కడిగే ఫ్యాక్టరీ మాకొద్దు
కాజీపేటలో ఏర్పాటు చేస్తున్న పీరియాడికల్ఓవర్హాలింగ్(పీవోహెచ్) సెంటర్కేవలం డబ్బాలు కడిగే పరిశ్రమ అని, అది తమకు అవసరం లేదని ఎర్రబెల్లి అన్నారు. తాము కోచ్ ఫ్యాక్టరీ కావాలని కోరుకున్నామన్నారు. పీవోహెచ్ కు ఎండోమెంట్ ల్యాండ్ ఇచ్చినందున దానికి కోర్ట్ పర్మిషన్ అవసరమని.. అందుకే భూమి అప్పగించడంలో ఆలస్యం అవుతోందన్నారు. కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నందునే ఇక్కడి నాయకులపై బురద జల్లేందుకే కిషన్‌రెడ్డి వచ్చారన్నారు. పీఎంఎస్ఎస్ వై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు రూ.10 కోట్లు రాష్ట్రం నుంచి విడుదల చేస్తే పనులు పూర్తి చేస్తామని చెప్పారని, సీఎంతో మాట్లాడి రూ. 12 కోట్లు మంజూరు చేయించినా పట్టించుకోవడం లేదన్నారు.
వరంగల్ లో ఏకపక్షంగా గెలుస్తం
హైదరాబాద్ లో మత తత్వంతో బీజేపీ, ఎంఐఎం పార్టీలు లబ్ధి పొందాయని ఎర్రబెల్లి అన్నారు. దుబ్బాకలో కేర్ లెస్ గా ఉండటం వల్లే తాము ఓడామని చెప్పారు. గ్రేటర్ వరంగల్ లో ఆ పరిస్థితులు ఉండవని, టీఆర్ఎస్ ఏకపక్షంగా గెలుస్తుందన్నారు. వరంగల్ ప్రజలు తెలివైనవాళ్లని, ఇక్కడ చిచ్చు పెట్టొద్దన్నారు. బీజేపీలోకి టీఆర్ఎస్ నేతల వలసలపై విలేకరులు ప్రశ్నించగా.. ‘ఒక పార్టీలో పక్కన పెడితే మరో పార్టీలోకి.. అక్కడ కాదంటే ఇంకో పార్టీలోకి వెళ్తుంటారు’ అని ఎర్రబెల్లి బదులిచ్చారు.