- బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- కాంగ్రెస్ లీడర్ల మాటలు నమ్మొద్దు
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తొర్రూరు, వెలుగు : ముదిరాజ్‌ల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి, పాలకుర్తి బీఆర్‌ఎస్ క్యాండిడేట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. మహబూబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఎల్‌వైఆర్ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన ముదిరాజ్ మహాసభకు శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్‌తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనను ప్రజలు పోల్చి చూసుకోవాలన్నారు. ప్రజల కష్టాలు పట్టించుకోని కాంగ్రెస్ లీడర్లు ఎన్నికల టైంలో మాయమాటలు చెప్తున్నారని, వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ముదిరాజ్‌ల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముదిరాజ్ స్టూడెంట్ల చదువు తగ్గట్టుగా ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే రుణం తీర్చుకుంటానన్నారు. శాసనమండలి చైర్మన్ బండాప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు మన బతుకులు ఎలా ఉండేవో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆలోచించుకోవాలన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేసిన కర్నాటక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ అమలు చేయని పథకాలను తెలంగాణలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, సురేందర్‌రెడ్డి, డాక్టర్ సోమేశ్వర్‌రావు, మాచర్ల భిక్షపతి, రమేశ్ పాల్గొన్నారు.
అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంట
రాయపర్తి, వెలుగు : తనపై చూపించే ప్రేమను ఎన్నటికీ మరువలేనని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ‘గడప గడపకు బీఆర్ఎస్ – పల్లె పల్లెకు దయన్న’ కార్యక్రమంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి డప్పు చప్పళ్లు, కోలాటాలు, బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏళ్ల తరబడి పాలించిన కాంగ్రెస్ హయాంలో తట్టెడు మట్టి కూడా పోయలేదన్నారు.
కేవలం మూడు గంటల కరెంట్ చాలు అని చెబుతున్న కాంగ్రెస్ లీడర్లు రైతుల సంక్షేమాన్ని ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. తనను మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. పెర్కవేడును మండలం చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ ప్రజలతో కలిసిమెలసి ఉంటే దయాకర్‌రావును గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ ఉషా దయాకర్‌రావు, నాయకులు గుడిపూడి గోపాల్‌రావు, జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, మునావత్ నర్సింహానాయక్, ఆకుల సురేందర్‌రావు, కాంచనపల్లి వనజారాణి పాల్గొన్నారు.