ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి : ఎర్రబెల్లి దయాకర్​రావు 

పాలకుర్తి, వెలుగు:  కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్లక్ష్యం తోనే రైతుల పంటలు ఎండి పోతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆరోపించారు.  జనగామ జిల్లా దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లోని   పలు గ్రామాల్లో ఆయన సోమవారం  ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.   అధికారులతో మాట్లాడి తక్షణమే దేవాదుల నీటిని విడుదల చేయాలని కోరారు.  గత  పదేండ్లలో రైతులకు ఎప్పుడూ ఈ పరిస్థితి రాలేదని,  ఎలాంటి  పరిస్థితి ఉన్నా  సాగునీరు తీసుకొచ్చానని చెప్పారు. ప్రైవేటుగా   ప్రొక్లైనర్లు తీసుకొచ్చి కాలువలు తవ్వి చెరువులు నింపానని గుర్తు చేశారు.

ఇప్పుడు ఈ ప్రాంతం  పూర్తిగా ఎడారిగా మారిపోయిందని అన్నారు. ధర్మసాగర్​ రిజర్వాయర్​లో నీళ్ళు ఉన్నాయని ప్రభుత్వం కో ఆర్డినేషన్​ లేక పోవడం వల్లే వాటిని ఇటువైపు తీసుకు రాలేక పోతున్నారని అన్నారు. తాను రాజకీయాల కోసం ఇక్కడికి రాలేదని పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతుంటే దైర్యం చెప్పేందుకు వచ్చానని అన్నారు. ఈ సందర్బంగా ఇరిగేషన్​ ఆఫీసర్లకు ఫోన్​ చేసి సకాలంలో రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.