
ఇంటిటికీ తిరిగి సీఎం కేసీఆర్ను దేవుడిలా చూపెట్టే బాధ్యతను గ్రామ సర్పంచులే తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కలెక్టరేట్లో మంత్రి కంటివెలుగు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో కంటివెలుగును విజయవంతం చేయాల్సిన బాధ్యత సర్పంచ్, కార్యదర్శిదేననన్నారు. కంటి వెలుగు క్యాంపు ఉన్న రోజున ఈజీఎస్ పనులను బంద్ పెట్టాలని మంత్రి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండోదశ కార్యక్రమం ఈ నెల 18న ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభించనున్నారు. జూన్ 15 వరకూ వంద రోజుల పాటూ కొనసాగనుంది. తొలి దశలో పెట్టినట్టే ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో క్యాంపులు పెట్టాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో 12,768 క్యాంపులు, పట్టణ ప్రాంతాల్లో 3,788 క్యాంపులు నిర్వహించనున్నారు.
ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ క్యాంపులు నిర్వహించనున్నారు. టెస్టుల కోసం క్యాంపునకు వచ్చే ప్రజల ఊరు, పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలన్నీ నమోదు చేసేందుకు యాప్ కూడా రూపొందించారు.