తొర్రూరు, వెలుగు : సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు చప్పుళ్లు, బోనాలు, బతుకమ్మలతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నికలు రాగానే కొందరు ఊళ్ల మీద పడ్డారని, అధికారం కోసం అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీని నమ్మితే నట్టేట మునగడం ఖాయమన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. పదేళ్లు అభివృద్ధి చేసిన ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలుకు సాధ్యం కాని సంక్షేమ పథకాలు ఇక్కడ ఎలా అమలు చేస్తారో ప్రజలు నిలదీయాలని సూచించారు. బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి, సంక్షేమం అని చెప్పారు. తెలంగాణలో మళ్లీ గెలిచేది బీఆర్‌ఎస్సేనని, కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ లీడర్లు కనిపిస్తారని, తాను మాత్రం నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటానని చెప్పారు. సీఎం కేసీఆర్ చొరవతో పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 3 వేలు ఇస్తామన్నారు. రైతులకు పెట్టుబడిసాయం కింద ఎకరానికి రూ. 16 వేలు అందజేస్తామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధికి పట్టం కట్టాలంటే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్‌రావు, ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, ఏవీఎస్‌కే గౌడ్ పాల్గొన్నారు.