గిరిజనులను పాలకులను చేసిన ఘనత కేసీఆర్​ది : ఎర్రబెల్లి దయాకర్​రావు 

పాలకుర్తి, వెలుగు : కాంగ్రెస్​కు ఓటేస్తే తెలంగాణలో చీకటి రాజ్యమేలుతుందని, ప్రజలు పాత రోజులను కొని తెచ్చుకోవద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. మంగళవారం జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్​ రాకన్న ముందు తండాల పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడేలా ఉందని అడిగారు. ఆనాడు తాగునీళ్ల కోసం ఎంత కష్టపడ్డారో గుర్తు చేసుకోవాలన్నారు.

నేడు తాగునీటి కష్టాలు లేవని, మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తున్నామన్నారు. 2009లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని హామీని బీఆర్​ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. రిజర్వేషన్లతో ఎంతో మంది గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారని తెలిపారు. మళ్లీ కేసీఆర్‌‌ వస్తే గిరిజనబంధు ఇస్తారన్నారు. గ్రామ పంచాయతీలు కొత్తవి కట్టుకుంటున్నామని, అలాగే ఎన్నికల్లో గెలువగానే ప్రతి రేషన్‌‌కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తామని, గ్యాస్‌‌ సిలిండర్‌‌ రూ.400కు ఇస్తామన్నారు. మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ ఒక్కవైపు ఉంటే.. మాట తప్పని కేసీఆర్ ఒకవైపు ఉన్నారన్నారు.

లంబాడాలు సేవాలాల్, కుమ్రుం భీం వారసులని, అందరూ సరైన ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు. కరెంట్ లేక ఒకప్పుడు పొలాలు బీడుబారి పోయిన రోజులున్నాయని, ఇప్పుడు కేసీeర్​  ఇస్తున్న 24 కరెంట్​తో రైతుల కండ్లలో ఆనందం నిండిందన్నారు. రైతుబంధు, దళిత బంధు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి అనేక ప్రజా సంక్షేమ పథకాలు పేదలకు ఆసరా అవుతున్నాయని వివరించారు. మహిళలకు కుట్టుమిషన్   ట్రైనింగ్ ఇప్పించి సంగెం టెక్స్టైల్ పార్క్ లో ఉద్యోగాలు ఇప్పించాను, ఇంకా ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. నియోజక వర్గంలోని యువకులకు 23 వేల డ్రైవింగ్ లైసెన్స్ లు ఇప్పించి వాళ్లకు భవిష్యత్ కోసం భీమా చేయించానని చెప్పారు.

ALSO READ : మైనార్టీలను ఆదుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ : హోం మినిస్టర్​  మహమూద్ అలీ

సిఎం కెసిఆర్​ సహాకారంతో నియోజక వర్గాన్ని రాష్ర్టంలోనే అభివృద్దిలో నాలుగో స్థానంలో నిలిపానని చెప్పారు. ఎన్నికల సమయంలో వచ్చే కొత్త నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకుంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్​ నాయకులు డబ్బులతో ఓట్లను కొనుగోలుకు పాల్పడుతున్నారని వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.