పాలకుర్తి, వెలుగు : మూడు, నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్‌ప్లాప్ అవుతుందని, బీఆర్‌ఎస్‌కు మళ్లీ ఊపు వస్తదని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్‌టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలు ఓడగొట్టారని గుర్తు చేశారు.
పార్లమెంట్, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలను ఎలా కాపాడుకోవాలన్న విషయంపై ప్రణాళిక ఉండాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికి పోవద్దని తాము అనుకున్నప్పటికీ, వాళ్లే తమ జోలికి వస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకొని కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.
మాజీమంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మాయమాటలు, అమలుకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల ముందు రైతుబంధు ఆపించిన కాంగ్రెస్ లీడర్లు, ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు రైతుబంధు రిలీజ్ చేయడం లేదన్నారు. కరెంట్ కోతలతో ప్రజలకు ఇప్పటికే కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు, ప్రజల ముందుకు వచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందన్నారు.
అన్నారం షరీఫ్‌లో ఎర్రబెల్లి ప్రార్థనలు
పర్వతగిరి, వెలుగు : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీష్ ఉర్సుకు ఆదివారం మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ హాజరయ్యారు. దర్గాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.