
- రేవంత్ రెడ్డి దొంగ మాటలు మాట్లాడుతున్నడు
- వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని అనలేదా అని ఫైర్
- స్టేషన్ ఘన్ పూర్ లో కడియం నామినేషన్
స్టేషన్ ఘనపూర్, వెలుగు : కాంగ్రెస్ హయాంలో కరెంట్ సరఫరా లోపాలతో వ్యవసాయ బోరు మోటార్లు కాలిపోయేవని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరెంట్ కష్టాల కాంగ్రెస్ కావాల్నో, వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాల్నో ప్రజలు తేల్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ ఆఫీసు నుంచి శివాజీ చౌక్ వరకు ర్యాలీ తీశారు. ర్యాలీలో మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బ్రోకర్ అని, దొంగ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
‘‘వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని అమెరికాలో రేవంత్ అన్నాడు. ఇక్కడేమో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తాం అంటున్నాడు. ఏది కరెక్టో రేవంత్ చెప్పాలి” అని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. కడియం మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఐదేండ్లు సేవచేస్తానని అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ ను పాలకుర్తికి దీటుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా టీపీసీసీ నాయకుడు బొల్లెపల్లి కృష్ణ బీఆర్ఎస్ లో చేరారు. ప్రచారంలో రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ ఐటం సాంగ్ లాంటోడు : ఎర్రబెల్లి దయాకర్రావు
పాలకుర్తి, వెలుగు : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ ఐటెం సాంగ్లాంటి వాడని, తామిద్దరం టీడీపీలో ఉన్నప్పుడే ఈ విషయం చెప్పానని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తనపై రేవంత్ చేసిన విమర్శలపై మంత్రి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ భూముల జోలికి, అక్రమ సంపాదన జోలికి పోలేదని ఆయన చెప్పారు.
రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు తను చేసే బ్లాక్మెయిల్, బ్రోకర్ పనులు మార్చుకోవాలని చంద్రబాబు ఎదుటే హెచ్చరించానని పేర్కొన్నారు. అయినప్పటికీ రేవంత్ తన పద్దతి మార్చుకోలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని రేటెంత రెడ్డి అని కాంగ్రెస్ నాయకులే విమర్శిస్తున్నారని అన్నారు. పాలకుర్తి బహిరంగ సభలో పాలకుర్తి కార్యకర్తను రేవంత్ రెడ్డి కాలితో తన్నాడని, అలాంటి వాడికి ఓటు వేయకూడదని ఓటర్లను ఆయన కోరారు.