వరంగల్ రూరల్ జిల్లా: గత వారం రోజులుగా భారీ వర్షాలు.. వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్షేత్ర స్థాయిలో పర్యటన చేపట్టారు. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి చెరువుకు గండి పడిన విషయం తెలిసి మంత్రి ఎర్రబెల్లి స్వయంగా సందర్శించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తో కలిసి గండి పడిన చెరువును సందర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.
ఉప్పరపల్లి చెరువు కింది నాలుగు గ్రామాలు, రోడ్లు, పంటలకు ముప్పు పొంచి ఉందని తెలిసి ఆయన అక్కడే మకాం వేశారు. అధికారులను పురమాయించి దగ్గరుండి గండిని పూ డ్చే పని మొదలుపెట్టించారు. పని మొత్తం పూర్తి చేయించిన తర్వాతే మంత్రి అక్కడి నుండి వెళ్లిపోయారు. 4 గ్రామాల్లో నీట మునుగకుండా ముందు జాగ్రత్త చర్యలతో కాపాడిన మంత్రి ఎర్రబెల్లి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వర్షాలు కురుస్తున్నందున చెరువుల క్రింది ప్రాంతాల ప్రజలు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు ఎక్కువగా పడుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.