తొర్రూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

  •     కాంగ్రెస్‌‌‌‌ నాటకాలు నమ్మొద్దు
  •     ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ కనిపించిందా ?
  •     మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

తొర్రూరు, వెలుగు : తొర్రూరు పట్టణాన్ని సుమారు రూ.200 కోట్లతో అభివృద్ధి చేసి మోడల్‌‌‌‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని మంత్రి, పాలకుర్తి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు చెప్పారు. అభివృద్ధిని చూసి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఓటు వేసి మళ్లీ గెలిపిస్తే ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా తొర్రూరు పట్టణంలోని యతి రాజారావు పార్క్‌‌‌‌లో ఆదివారం మార్నింగ్‌‌‌‌ వాక్‌‌‌‌ చేశారు. స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం అమ్మాపురం, కంఠాయపాలెం రోడ్డులో మార్నింగ్‌‌‌‌ వాకర్స్‌‌‌‌తో మాట్లాడారు. పట్టణంలోని హైస్కూల్‌‌‌‌కు వెళ్లి యువకులతో కలిసి వాలీబాల్‌‌‌‌ ఆడారు. అలాగే స్థానికంగా గల ఓ టీ కొట్టుకు వెళ్లి ఛాయ్‌‌‌‌ రెడీ చేశారు. అనంతరం బైక్‌‌‌‌పై పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌‌‌‌రావు మాట్లాడుతూ తొర్రూరు పట్టణంలో మరో రూ. 100 కోట్లతో వివిధ పనులు ప్రారంభించామని, ఎన్నికల అనంతరం వాటిని స్పీడప్‌‌‌‌ చేస్తామని చెప్పారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు దూసుకెళ్తోందన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌ చేసిన అభివృద్ధిని చూసి తనను మరోసారి గెలిపించాలని కోరారు. 

పదేళ్ల పాలనలో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఓటు వేసే ముందు ప్రతిఒక్కరూ తమ భవిష్యత్‌‌‌‌ గురించి ఆలోచించుకోవాలని సూచించారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌‌‌‌ పాలనలో దేశాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాలకు క్వాలిటీ రోడ్లు, నిరంతర కరెంట్‌‌‌‌ వచ్చిందన్నారు. కేసీఆర్‌‌‌‌ మళ్లీ సీఎం అయితే వృద్ధులకు రూ.5 వేల పెన్షన్‌‌‌‌, రైతు బంధు రూ.16 వేలకు పెంచుతామన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ ఎక్కడైనా కనిపించిందా అని ప్రశ్నించారు. డాలర్లను నమ్మి ప్రజలు మోసపోవద్దని, కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌కు ప్రజల కష్టసుఖాలు తెలియవన్నారు. 

కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌కు డిపాజిట్‌‌‌‌ దక్కకుండా చేయాలని సూచించారు. అనంతరం పలువురు నాయకులు మంత్రి దయాకర్‌‌‌‌రావు సమక్షంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. అదే విధంగా ఎర్రబెల్లి ట్రస్ట్​చైర్మన్‌‌‌‌, మంత్రి భార్య ఉషా దయాకర్‌‌‌‌రావు సైతం పలు వార్డుల్లో ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ సుధాకర్‌‌‌‌రావు, ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రామచంద్రయ్య, వీఎన్‌‌‌‌గౌడ్‌‌‌‌, పొనుగోటి సోమేశ్వర్‌‌‌‌రావు, కిశోర్‌‌‌‌రెడ్డి, సీతారాములు, బిందు శ్రీను, దేవేందర్‌‌‌‌రెడ్డి, సురేందర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.