పెంచి పెద్ద చేసిన పార్టీపైనే పిచ్చికుక్కల్లా ఒర్రుతున్నరు: ఎర్రబెల్లి దయాకర్

ఈటల రాజేందర్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు చేశారు. అవ్వా, అయ్యా సచ్చిపోతా అంటే ఈటలను ఇక్కడి ప్రజలు గెలిపించారని అన్నారు. జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్‭లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. పెంచి పెద్ద చేసిన పార్టీపైనే కొందరు పిచ్చికుక్కల్లాగా ఒర్రుతున్నారని ఈటలపై మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు ఉందా అని ఆయన ప్రశ్నించారు. అక్కడ ఇచ్చే పింఛను కేవలం రూ.500 మాత్రమేనని చెప్పారు. అసలు బండి సంజయ్ ఎంపీగా ఉండి ప్రజలకు ఏం చేశాడని నిలదీశారు. బీజేపీని దగ్గరకు రానిస్తే నాశనమైపోతామని చెప్పారు. గ్యాస్, పెట్రోలు ధరల పెరుగుదల వల్లే ఇతర నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీజేపీని తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుజురాబాద్ అభివృద్ధి కోసం ఏమడిగినా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరోసారి ఇక్కడి ప్రజలు తప్పు చేయవద్దన్నారు.