సమస్యలను పట్టించుకోనోళ్లకు ఓటెందుకెయ్యాలి: ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు

వరంగల్​సిటీ, వెలుగు : సమస్యలు పట్టించుకోని లీడర్లకు ఎందుకు ఓటెయ్యాలని  బీజేపీ స్టేట్‌‌ లీడర్‌‌, వరంగల్‌‌ అర్బన్‌‌ కో ఆపరేటివ్‌‌ బ్యాంక్‌‌ చైర్మన్‌‌ ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు ప్రశ్నించారు. వరంగల్‌‌ తూర్పులో బీఆర్‌‌ఎస్‌‌ను ఓడించి, కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌‌ పరిధిలోని 35వ డివిజన్‌‌కు చెందిన పలువురు ఆదివారం బీజేపీలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు.

అనంతరం ప్రదీప్‌‌రావు మాట్లాడుతూ ప్రధాని మోదీ పథకాలకు ఆకర్షితులయ్యే చాలా మంది యువత బీజేపీలో చేరుతున్నారన్నారు. స్థానిక సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎలక్షన్లు వస్తుండడంతో దళితబంధు, బీసీ ఆర్థికసాయం అంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలు కూడా బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లకే అందజేస్తున్నారని ఆరోపించారు. టెక్స్‌‌టైల్‌‌ పార్క్‌‌ త్వరగా పూర్తైతే లక్షల మంది యువతకు జీవనోపాధి లభించేదన్నారు.

స్మార్ట్ సిటీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఆ పనులు పెండింగ్‌‌లో పడ్డాయన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇనుముల అజయ్‌‌, వైట్ల గణేశ్‌‌, పిట్టల వెంకన్న, చింతల నవీన్, చింతం రాజు, భూపతి కృష్ణ, చంద రాజు, ఎండీ.యాకూబ్‌‌, రజనీకాంత్‌‌ పాల్గొన్నారు.