వరంగల్, వెలుగు: వరంగల్ తూర్పు నుంచి గూండాలు, రౌడీలను ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. జనాలకు ఇబ్బందులు తప్పవని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‍రావు హెచ్చరించారు. ఆదివారం హంటర్‍రోడ్‍లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ..వరంగల్ తూర్పులో గూండాల పాలన వద్దని, సౌమ్యుడు ప్రదీప్‍రావును గెలిపించాలని మంద కృష్ణమాదిగ కోరారు.
వంద శాతం దళితుల మద్దతు ఆయనకు ఉంటుందన్నారు. ప్రదీప్‍రావు మాట్లాడుతూ గతంలో కొండా సురేఖను గెలిపిస్తే గూండాయిజం, రౌడీయిజాన్ని తూర్పు నియోజకవర్గానికి కేరాఫ్ చేశారన్నారు. నన్నపునేని నరేందర్‍ను గెలిపిస్తే భూకబ్జాలే మిగిలాయన్నారు. దళితబంధు పథకం కోసం లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షల చొప్పున లంచం తీసుకున్నాడని ఆరోపించారు. వారికి ఎమ్మెల్యేగా అవకాశమిస్తే నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చారన్నారు.
తనకు ఒక్క అవకాశమిస్తే పరిశ్రమలు తీసుకొచ్చి దళితులకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ప్రజల గౌరవం కాపాడుతానని లేనిపక్షంలో మరోసారి ఓటు అడగనని చెప్పారు.