
హైదరాబాద్ సిటీ, వెలుగు: జిల్లాలో అంగవైకల్యం ఉన్నవారికి, మానసిక రోగులకు ఇకపై యూనిక్ డిజెబిలిటీ కార్డులను జారీ చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ను డీఆర్వో వెంకటాచారితో కలిసి తనిఖీ చేశారు. సదరం సెంటర్ ను పరిశీలించి, మౌలిక వసతులు కల్పించాలన్నారు.
ఈ కేంద్రం యూడీఐడీ సెంటర్ గా పని చేస్తుందని తెలిపారు. యూడీఐడీ సర్టిఫికెట్లు జారీ చేయడానికి ఉస్మానియా హాస్పిటల్ ఆర్థోపెడిక్, సరోజినీ దేవి ఇంటి ఆసుపత్రి, కోఠి ఈఎన్టీ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి సెంటర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ అనిత, తహసీల్దార్ పద్మ సుందరి తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం వైద్య విధాన పరిషత్ పరిధిలో గల వివిధ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు, వైద్యాధికారులతో డీసీహెచ్ రాజేంద్రనాథ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. సాధారణ కాన్పులకు ప్రాధాన్యం ఇవ్వాలనిచెప్పారు. మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపాలని, కాంట్రాక్ట్ వైద్యాధికారుల ఖాళీల వివరాలు ఇవ్వాలని సూచించారు.